ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంతో వ్యాపారం

ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంతో వ్యాపారం


► ఆడిటోరియాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించనున్న ముఖ్యనేత

► కార్పొరేషన్‌ నుంచి తప్పించే యత్నం

► కళాకారులకు ఇస్తామన్న హామీ తుంగలో...

► ఆవేదన వ్యక్తం చేస్తున్న కళాకారులు




సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాదేదీ వ్యాపారానికి అనర్హం... అన్నట్లుగా తయారైపోయారు అధికార పార్టీ నేతలు. ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ఎన్‌టీఆర్‌ ఆడిటోరియాన్ని సైతం వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కళాక్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో కళాకారులకి చ్చిన హామీ తుంగలో తొక్కి అధికార పార్టీ ముఖ్యనేత ఈ ఆడిటోరియాన్ని తన అనుచరుడైన కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



నగరంలోని వైఎస్సార్‌ విగ్రహం సర్కిల్‌లో ఆర్డీవో కార్యాలయం పరిధిలో ఉన్న బాలభవన్‌ను తాజాగా ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంగా మార్చారు. కళాకారుల కోరిక మేరకు ఈ ఆడిటోరియం రూపుదిద్దుకుంది. ఇందుకోసం కళాకారులు తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యంగా రంగభూమి కళాకారుల సంఘం ఆడిటోరియం నిర్మాణంలో కీలకభూమికి పోషించారు. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకొని ఎన్‌టీఆర్‌ ఆడిటోరియాన్ని ఈ నెల 1న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆడిటోరియం నిర్మాణ బాధ్యతను కళాకారులకే అప్పగిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ గతంలో పలుమార్లు హామీ ఇచ్చారు.



తాజాగా ఆ హామీని తుంగలో తొక్కి ఆడిటోరియం నిర్వహణ బాధ్యతను తన అనుచరుల్లో ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆడిటోరియాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే రోజుకు రూ.5 నుంచి రూ.10 వేలు వసూలు చేసే అవకాశం ఉంది. కాంట్రాక్టర్, రిటైర్డు ఫంక్షన్లతో పాటు ఓణీల ఫంక్షన్‌ మొదలుకొని అన్ని కార్యక్రమాలకు ఆడిటోరియంలో నిర్వహించి వ్యాపారానికి అనువుగా మార్చుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ధనార్జనే ధ్యేయంగా ఆడిటోరియాన్ని మార్చుకునేందుకు కార్పొరేషన్‌ అధికారులు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.



ఇదే జరిగితే సామాన్య కళాకారులకు ఆడిటోరియం అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. వాస్తవానికి ఒంగోలు నగరంలో ఎ/సి కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లకు కొదువ లేదు. ఆర్థిక స్థితికనుగుణంగా ఫంక్షన్ల నిర్వహణకు అన్ని రకాల ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయి. కళాకారులకు వేదిక లేకపోవడంతో ఆడిటోరియం కోసం దశాబ్దాలుగా వారు పోరుబాట సాగించారు. తమ కళలను వెలుగులోకి తెచ్చుకునేందుకు వేదిక కోసం అహర్నిశలు కృషి చేశారు. పేద కళాకారులు తమ కళలను ప్రదర్శించుకునేందుకు ఈ ఆడిటోరియం ఉపయోగపడాల్సి ఉంది.



కానీ వారి కోసం నిర్మించిన ఆడిటోరియాన్ని ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్‌ ఆడిటోరియంగా మార్చేందుకు అధికార పార్టీ ముఖ్యనేత నిర్ణయం తీసుకోవడంపై కళాకారులు ఆవేదన వ్యక్తం      చేస్తున్నారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఆడిటోరియం ముఖ్యనేత అనుచరులకు ఆర్థిక ఎదుగుదల కోసం ఉపయోగపడేలా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళాకారుల కమిటీ ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తమకు అప్పగించాలని రంగభూమి కళాకారుల సంఘం డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.



కళాకారుల కార్యక్రమాలు ఉన్న సమయంలో నామమాత్రంగా రూ.1,500 నుంచి రూ.2 వేల చార్జితో ఆడిటోరియాన్ని ఇవ్వాలని, కళాకారుల కార్యక్రమాలు లేని సమయంలో మాత్రమే ఆడిటోరియం నిర్వహణ భారం కాకుండా ఉండేందుకు మిగిలిన వారి కార్యక్రమాలకు ఇవ్వాలని కళాకారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడిటోరియం కళాకారులు లేదా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నది వారి వాదన. అలా కాకుండా అధికార పార్టీ కాంట్రాక్టర్‌కు ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంను అప్పగించే పక్షంలో ఆందోళనకు దిగుతామని కళాకారులు హెచ్చరిస్తున్నారు.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top