దొంగలు బాబోయ్ దొంగలు

దొంగలు బాబోయ్ దొంగలు - Sakshi


ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్ /అర్భన్) :దొంగల స్వైర విహారంతో జిల్లావాసులు బెంబేలె త్తిపోతున్నారు. ఒంటరి గా వెళుతున్న మహిళల మెడలో నగలను బైక్‌లపై దూసుకు వచ్చే చైన్ స్నాచర్లు తెంచుకునిపోతున్నారు. ఎవరైనా వ్యక్తులు భారీ మొత్తంలో నగదు తీసుకు వెళుతుంటే వారిని ఏమార్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. రాత్రీ, పగలు భేదం లేకుండా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఏటీఎంలలో సైతం కన్నాలు వేస్తూ దొంగలు ప్రజలను ఠారెత్తిస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, జీపులు కూడా క్షణాలలో మాయం చేస్తున్నారు. రాత్రి వేళ నగరాలు, పట్టణాల శివార్లు, జాతీ య రహదారులపై వెళుతున్న వాహనాలను అడ్డగించి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరైనా వ్యక్తులు విలువైన ఆస్తులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తెచ్చుకున్న సొమ్ము వాహనాలలో ఉంచితే  గద్దల్లా తన్నుకు పోతున్నారు.

 

 ఇంకా కొంచెం తెలివి మీరిన దొంగలు ధనిక వర్గాలకు చెందిన చిన్నారులను, వ్యక్తులను కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో కిడ్నాపర్‌ల డిమాండ్‌కు అంగీకరించక పోయినా.. పోలీసులను ఆశ్రయించారని తెలిసినా కిడ్నాప్ చేసిన వ్యక్తులను, చిన్నారులను దారుణంగా చంపేందుకు సైతం వెనుకాడక పోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడునెలల క్రితం జంగారెడ్డిగూడెంలో ఒక వ్యాపారిని  కిడ్నాప్ చేసి అతని కుటుంబ సభ్యులను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. నిర్ణీత సమయానికి వారు డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో, నగర శివార్లలో ఉండే గృహాలలో దోపిడీకి పాల్పడే క్రమంలో కొన్ని సందర్భాలలో హత్యలు, అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారు.

 

 చోద్యం చూస్తున్న పోలీసులు

 కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల  50కి పైగా దోపిడీలు, దొంగతనాలు జరిగినా, ఏ ఒక్క కేసులోనూ నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. జిల్లాలోకి ప్రవేశించే అనుమానిత వ్యక్తులను, అంతర్రాష్ర్ట దొంగలను ఏరివేసేందుకు ఇటీవల పోలీస్ యంత్రాంగం కార్డన్ సెర్చ్ పేరిట నిర్వహించిన తతంగం అంతా ఇంతా కాదు. అయితే ఈ కొత్త కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితమైందని ప్రజలు భావిస్తున్నారు. తాజాగా ఉండి  గ్రామంలో జరిగిన చెయిన్ స్నాచింగ్ ఘటనలో కూడా ఇతర రాష్ట్రాల దొంగలు హల్‌చల్ చేయడం ప్రజల ఆరోపణలకు ఊతమిస్తోంది. అదే క్రమంలో మంగళవారం రాత్రి భీమడోలులో షట్టర్లు పగులగొట్టి బంగారు ఆభరణాల దుకాణం, బ్రాందీషాపులో జరిగిన దొంగతనాలలో పోలీసింగ్ డొల్లతనం బయటపడిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top