భారం రూ.6.5 కోట్లు


 సాక్షి, రాజమండ్రి : ఇంద్రజాల విద్యలో ప్రపంచ ఖ్యాతినొందిన పీసీ సర్కారు బృందం చేసే ట్రిక్కుల్లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేసేవి ఎన్నో ఉంటాయి. ఆ ఇంద్రజాలం ప్రజలకు వినోదాన్నిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న సర్కార్లూ కొన్ని ట్రిక్కుల్ని చేస్తుంటాయి. అయితే అవి ప్రజలను బురిడీ కొట్టిస్తుంటాయి. ఏదైనా రేటు రూ.ఐదు పెంచాలనుకున్నప్పుడు ముందు రూ.10 పెంచి, ఆనక రూ.5కి తగ్గించి ఊరటనిచ్చినట్టు ఫోజు కొట్ట డం ఆ బాపతే. ఈ మధ్య పెట్రోధరలను కాస్త తగ్గించినట్టు తగ్గించి.. అంతలోనే పెంచడం కూడా ఆ తరహా ట్రిక్కే. 


గతంలో  యూపీఏ సర్కారు అనుసరించిన చిట్కానే ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమూ అనుసరిస్తోంది. అధికారంలోకి రాగానే  కాస్త ధరలు తగ్గించినట్టు కనిపించినా మళ్లీ షరా మామూలుగా వాతలు పెట్టడం ప్రారంభించింది. తాజాగా శనివారం అర్ధరాత్రి నుంచి అమలయ్యేలా లీటరు పెట్రోలుకు రూ.3.18, డీజిల్‌కు రూ.3.90 పైసలు పెంచింది. ఫిబ్రవరి 15నే పెట్రోలు ధరను 0.81 పైసలు పెంచి 13 రోజుల్లోనే రెండోసారి పెంచింది.  ఈ సారి డీజిల్ ధరా పెరగడంతో వాహనాల ఆపరేటర్లు సరుకు రవాణా చార్జీలు భారీగా పెంచి తమ భారాన్ని ప్రజలపైనే మోపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 

 భారం జిల్లాపైనే ఎక్కువ..

 హైదరాబాద్ తర్వాత అత్యధిక సంఖ్యలో సుమారు ఐదు లక్షల వరకూ ద్విచక్ర వాహనాలు మన జిల్లాలో ఉన్నాయని అంచనా నెలకు ఒక్కో వాహన చోదకుడు 20 లీటర్ల చొప్పున నెలకు దాదాపు కోటి లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నారు. జిల్లాలోని 200 బంకుల ద్వారా వీరికి  పెట్రోలు సఫరా అవుతోంది.  పెంచిన ధరల ప్రకారం రూ.మూడు కోట్ల మేర ప్రజలపై పెట్రోలు ద్వారా భారం పడనుంది.

 

 డీజిల్ పై మరింత భారం..

  జిల్లాలో ఉన్న 200 బంకుల్లో ఒక్కోటీ రోజుకు 2000 లీటర్ల డీజిల్ వాహనాలకు అందిస్తాయి. ఈ ప్రకారం నెలకు సుమారు కోటీ 20 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది. ధర పెరుగుదలతో పడే భారం రూ.3.50 కోట్లు పైనేనని అంచనా.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top