ఈ కేటాయింపులు ఏ మూలకు


ఐఐఎంకు రూ.40 కోట్లు

ఉన్నత విద్యాసంస్థ నిర్వహణకు  సరిపడని నిధులు

మెట్రోరైలుకు రూ.5.3కోట్లు

వేతన జీవులకు నిరాశ


 

ఏయూక్యాంపస్: కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో విశాఖ నగరంలో ఐఐఎం ఏర్పాటుకు, మెట్రోరైల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు కేవలం కంటితుడుపుగా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటుచేయడానికి ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో గంభీరంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ఐఐఎంకు 40 కోట్లు కేటాయించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విశాఖలో ప్రవేశాలు కల్పించాలని, తాత్కాలికంగా ఏయూలో దీనిని ఏర్పాటుచేయాలని గతంలో నిర్ణయించారు. గంభీరంలో నూతన క్యాంపస్‌కు కేంద్ర మావన వనరుల శాఖమంత్రి స్మృతి ఇరాని ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐఎం రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలంటే తక్షణం కొన్ని మౌలిక వసతులు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి కోట్ల రూపాయలు వెచ్చించాలి. ప్రస్తుతం కేంద్రం విదిల్చిన 40 కోట్లు తాత్కాలిక ఐఐఎం నిర్వహణకు, శాశ్వత భవనాలు, క్యాంపస్ అభివృద్దికి సమానంగా వెచ్చించాల్సిన అవసరం ఉంది.



మొత్తంమీద విశాఖలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అనుకున్న విధంగా ఐఐఎం ప్రారంభించడానికి ఈ నిధులు కొంత      వరకు ఉపకరించే అంశం. గంభీరంలో శాస్వత క్యాంపస్ ఏర్పాటు వేగవంతం చేయడానికి మాత్రం ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయానికి కేంద్రం కదలిక మాత్రమే తెచ్చింది. ఈ బడ్జెట్‌లో కేటాయించిన 5.3 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును డిల్లీ మెట్రో కార్పొరేషన్‌కు అందించింది. శ్రీధరన్ తొలి దశలో విశాఖలో గతలో పర్యటించి ప్రాధమికంగా ఒక అవగాహనకువచ్చారు. అందరూ ఆశించిన స్థాయిలో ఈ రెండు ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉంటాయని భావించినప్పటికీ కేంద్రం కరుణ చూపలేదు.



వేతన జీవులకు నిరాశే: విశాఖ నగరం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధిస్తోంది. నగరంలో అధికశాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు. వీరు ఆదాయపన్ను పరిమితి పెంపుదల జరుగుతుదని ఆశించారు. వీరి ఆశలను నిరాశ పరిచే విధంగా ఈ బడ్జెట్ సాగడంతో ఉద్యోగులంతా తీవ్రంగా నిరాశ చెందారు. వేతన జీవులకు ఎంతమాత్రం ఈ బడ్జెట్ దయ చూపలేదు. పాత శ్లాబులే కొనసాగింపుపై ఈ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top