దంతపురి.. రియల్టర్ల సిరి

దంతపురి.. రియల్టర్ల సిరి


సరుబుజ్జిలి:అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా సిద్ధంగా లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా వస్తున్న ప్రాజెక్టులను సొమ్ము చేసుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అందిన చోటల్లా భూములను ఏదో విధంగా స్వాధీనం చేసుకొని లే అవుట్ల పేరుతో తెగనమ్మేస్తున్న రియల్టర్ల దృష్టి ఇప్పుడు ప్రముఖ బౌద్ధారామంగా విలసిల్లుతున్న దంతపురిపై పడింది. ఫలితంగా ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

 

 కారణమేమిటంటే..

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిన  ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు ప్రకటించాయి. వీటిలో టూరిజం కారిడార్‌తోపాటు శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు  వరకు ఉన్న బౌద్ధ క్షేత్రాలను కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే.. ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించని సరుబుజ్జిలి మండలంలోని దంతపురి క్షేత్రంపై రియల్టర్ల దృష్టి పడింది. రొట్టవలస గ్రామ సమీపంలో ఉన్న దంతపురి బౌద్ధారామాలతో ప్రముఖ పురావస్తు పర్యాటక కేంద్రంగా పేరొందింది. అయితే ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇంతకాలం ఇది అభివృద్ధికి నోచుకోలేదు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రతిపాదన వల్ల ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుందో లేదో గానీ.. భూముల ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడికొచ్చి భూములను కొనుగోలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల్లోనే దంతపురి పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 69 పరిధిలో సుమారు 150 ఎకరాలు భూములను  ఇతర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేశారు. వీటిని లే అవుట్లు వేసి, ప్లాట్లుగా విభజించి అమ్ముకునేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగింది. ఎన్నడూ పెద్దగా ధరల పలకని భూములు సైతం ప్రస్తుతం సెంటు రూ.లక్ష పలుకుతున్నాయి.  

 

 నిబంధనలకు పాతర

 పురావస్తు శాఖ అధీనంలో ఉన్న భూముల్లో క్రయ విక్రయాలు, వాటిలో నిర్మాణాలు చేపట్టరాద ని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రియల్ వ్యాపారుల ధాటికి ఇవి కొట్టుకుపోతున్నాయి. రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి ఒకే సర్వే నెంబర్‌తో విక్రయించి, రిజిస్ట్రేషన్లు కూడా చేయించేందుకు లోపాయికారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దంతపురిలో గౌతమ బుద్ధుని విగ్రహం, మరికొన్ని స్థూపాలు ఉన్న ప్రదేశం మినహా మిగిలిన భూములు ఇతరుల ఆధీనంలో ఉండటం రియల్టర్లకు అనుకూలంగా పరిణమించింది. ప్రస్తుతం భూముల క్రయవిక్రయాలు పెరగడం వల్ల పురాతత్వ సంపదకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 దళారుల రంగ ప్రవేశం

 ఇతర ప్రాంతాల రియల్ వ్యాపారులు రంగప్రవేశం చేయడం, భూములకు డిమాండ్ పెరగడంతో కొందరు దళారుల అవతారం ఎత్తుతున్నారు. ఒప్పందాలు కుదిర్చి ఇటు రైతులు, అటు వ్యాపారుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. ముఖ్యంగా దంతపురి సమీపంలోని పెద్దపాలెం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటువంటి వ్యవహారాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగిగా తన పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ రికార్డులను సైతం తారుమారు చేసి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహారాలు చక్కబెట్టడం ద్వారా భారీగా కమీషన్లు కొట్టేస్తున్నట్లు సమాచారం. పురావస్తు, రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించి భూములను సర్వే చేసి, పరిరక్షించకపోతే ప్రభుత్వ భూములు కరిగిపోవడమే కాకుండా అపురూపమైన పురాతత్వ సంపద ఉనికి కోల్పోయే ప్రమాదముంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top