బుచ్చయ్య దూషణల పర్వం

బుచ్చయ్య దూషణల పర్వం - Sakshi

  • అసెంబ్లీలో వైఎస్, రోజాలపై అనుచిత వ్యాఖ్యలు

  • సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ సభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి కారణమయ్యారు. సోమవారం రుణమాఫీపై చర్చ సందర్భంగా.. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.



    అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 500 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 172 మిల్లీమీటర్లే నమోదైనా జిల్లాలోని 4 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడాన్ని తప్పుబట్టారు. ఆయన ప్రసంగం కొనసాగుతుండగానే మైక్ కట్ చేసి.. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చ య్య చౌదరికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. ప్రసంగం ప్రారంభించిన గోరంట్ల.. రోజా సినిమాలు, టీవీల్లో విలన్ వేషాలు వేశారని, అందుకే సభలో కూడా విలన్ వేషాలు వేస్తున్నారంటూ దూషించారు.



    చంద్రబాబుకు ముని శాపం ఉందని జగన్ అన్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణా లు గాల్లో ఉన్నప్పుడే గాల్లో కలిసిపోయాయని దూషించారు. బుచ్చయ్య దూషణల పర్వంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తన గురించి అనుచిత వ్యాఖ్యానాలు చేసినందున తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రోజా స్పీకర్ పోడియం వద్ద నిలబడి గట్టిగా డిమాండ్ చేశారు.



    సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 344 నిబంధన కింద జరిగిన ఈ చర్చకు మంత్రి సమాధానం ఇవ్వకుండానే స్పీకర్ సభను అర్ధాంతరంగా సాయంత్రానికి వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత వైఎస్సార్‌సీపీ సభ్యులు గోరంట్లతో వాగ్వాదానికి దిగారు. అయితే పత్రికల్లో రాయలేని భాషలో రోజాను గోరంట్ల దూషించారు. ఆమె కంటతడి పెట్టడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా  ఎదురుదాడి చేశారు.

     

    కౌరవ సభలా వ్యవహరించారు: జగన్



    సభ తిరిగి నాలుగు గంటలకు ప్రారంభం కాగానే రోజా తన ఆవేదనను సభ ముందుంచే ప్రయత్నం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరించడాన్ని సభాపతి కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. దీనికి ఆగ్రహించిన సభాపతి కోడెల శివప్రసాదరావు ‘హోల్డ్ యువర్ టంగ్’ అంటూ రోజాను వారించారు. ఆ సమయంలో ఎవరేం మాట్లాడారో విన్పించలేదని, సీసీ కెమెరాలను పరిశీలించి నిర్థారణకు వస్తానని చెప్పారు.



    మంత్రి యనమల రామకృష్ణుడు కల్పించుకుని సభలోనే కాదని, సభ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఎవరేం మాట్లాడుకున్నారో కూడా టేపుల్లో పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఓ మహిళా సభ్యురాలు తనకు అవమానం జరిగిందని కన్నీరు పెడితే, కనీసం క్షమాపణ కూడా చెప్పకపోతే, మనమంతా ఎమ్మెల్యేలమేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక ఆడకూతురికి అవమానం జరిగిందంటే కనీసం స్పందించడం లేదని, కౌరవ సభలా వ్యవహరించారని, కౌరవులకు పట్టిన గతే పడుతుందని, అన్నీ దేవుడే చూసుకుంటాడని అన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top