విరుచుకుపడ్డ మావోయిస్టులు

విరుచుకుపడ్డ మావోయిస్టులు


మందుపాతర పేలి ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ ట్రైనీ జవాన్లు మృతి

సాక్షి నెట్‌వర్క్, విజయనగరం/సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులు చెలరేగి పోయారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. 13 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వస్తున్న జీపును లక్ష్యంగా ఎంచుకుని సాలూరు–జైపూర్‌ మధ్య 26వ నంబర్‌ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మి వద్ద బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కల్వర్టును పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగా త్రులకు తొలుత సాలూరు, ఒడిశాలోని పొట్టంగి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని సెవెన్  హిల్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు తునాతునకల య్యాయి.


ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. జీపులో ప్రయాణించిన 13 మంది సెలక్షన్ లో ఎంపికైనప్పటికీ ఏడాదిగా ఉద్యోగం పొందలేకపోయారు. కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయడంతో ఇటీవల ఉద్యోగ నియామక ఉత్తర్వులొచ్చాయి. ఈ ఉత్తర్వులతో వీరు పోలీసు జీపులో కొరాఫుట్‌ నుంచి కటక్‌కు శిక్షణకు వెళ్తుండగా మావోయి స్టుల దాడికి గురయ్యారు. వీరంతా అసిస్టెంట్‌ డ్రైవర్‌ హోదా గలవారు. ఘటన స్థలం ఒడిశా సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.



పక్కా పథకం ప్రకారం పేలుడు

పైపులైను డిటోనేటర్ల ద్వారా మావోయిస్టులు ఈ పేలుడుకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని రాంగఢ్‌లో మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా పక్కా పథకంతో ప్రతీకార దాడికి దిగినట్టు సమాచారం. పేలుడు ఘటన వెనక 15 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒడిశా సరిహద్దులోని కొరాపుట్‌ చెక్‌ పోస్టు వద్ద, ఆంధ్రా సరిహద్దులోని పి.కొనవలస చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచి బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వెళ్తున్న జీపును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే సాలూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.


జిల్లా ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కరోజు కూడా శిక్షణ తీసుకోని ట్రైనీ జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టడం దారుణమని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. కాగా, మల్కన్ గిరి ఎన్ కౌంటర్‌ (30 మంది మావోయిస్టులు మృతి చెందారు) జరిగి సరిగ్గా వంద రోజులైన నేపథ్యంలో ఈ దాడి జరగడం విశేషం. ఘటన నేపథ్యంలో ఏజెన్సీ బలగాలను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. హిట్‌ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, కోవర్టులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు.



మృతులు, క్షతగాత్రుల వివరాలు

 తులసీ మజై, సోమనాథ్‌ సిసా, పి.నాయక్, చిట్ట దాస్, సంజయ్‌కుమార్‌ దాస్, ఎల్‌.కే. నాథ్, అర్జున్ కుమార్‌ నాయక్, ప్రదీప్‌మాలిక్, రాధేశ్యాం దాస్,  సుభరాన్ కుమార్‌ దాస్, గణేష్‌ ప్రసాద్‌ దాస్, ప్రమోద్‌కుమార్‌ బిశ్వాల్, ప్రదీప్త కుమార్‌ రౌత్‌లలో ఎనిమిది మంది చనిపోయారు. మిగతా ఐదుగురు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరు మృతులు, ఎవరు క్షతగాత్రులోఅధికారులు తెలియజేయలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top