చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన నిర్లక్ష్యం

చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన నిర్లక్ష్యం


కృష్ణపల్లి (పార్వతీపురం రూరల్) : మధ్యాహ్న భోజన నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ చిన్నారుల ప్రాణాలకు మీదకు తెచ్చింది. నిత్యం భోజనం బాగోక పోయినా నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అడగలేకపోతున్న తల్లిదండ్రుల  భయం వారి బిడ్డలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో  విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా చెడు వాసన రావడంతో కొంతమంది ఆరుబయటే పారబోశారు. భోజనం చేసిన ఒకరిద్దరు విద్యార్థులకు కడుపులో తిప్పినట్లు అనిపించడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు.

 

 దీంతో కృష్ణపల్లి గ్రామస్తులు బుధవారం ఒక్కసారిగా భీతిల్లారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు చేరుకుని గగ్గోలు పెట్టారు. ఒంట్లో తిప్పుతున్నట్లు ఉన్న కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులే మోటారు సైకిల్‌పై పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలిస్తే మంచిదని 108 వాహనంలో మరికొంతమందిని తరలించారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ కేవీడీ ప్రసాద్ హుటాహుటిన తమ సిబ్బందితో సహా పాఠశాలకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేశారు.

 

 ఆ సమయంలో భోజన నిర్వాహకులు హాజరు కాకపోవడంతో తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని తొలగించి కొత్తవారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ప్రధానోపాధ్యాయుడు బలగ శంకరరావుకు సూచించారు. పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా బుధవారం మధ్యాహ్నం భోజనానికి 96 మంది హాజరైనట్లు హెచ్‌ఎం తెలిపారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు భోజనం చేయడం వల్ల ఏమీ కాలేదని కొంతమందికి మాత్రమే ఒంట్లో తిప్పినట్లు అన్పించిందని తహశీల్దార్ కు తెలిపారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు.

 

 65 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు

  భోజనం వికటించడంతో అస్వస్థతకు గురైన  విద్యార్థుల తో పాటు భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్న మరి కొంతమం ది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. దీంతో 65 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకున్నారు.

 

 ఏడ్పులతో దద్దరిల్లిన ఏరియా ఆస్పత్రి...!

 పార్వతీపురం/బెలగాం: ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన  65 మంది పిల్లలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆస్పత్రంతా పిల్లలు వారి తల్లిదండ్రుల ఏడ్పులతో దద్దరిల్లింది. ఆస్పత్రికి వచ్చిన పిల్లలకు వైద్యులు జి.నాగశివ జ్యోతి, డా.బి.వెంకటరావు, జి.వాసుదేవరావు, రాజీవ్, సంతోష్, సత్యనారాయణ మూరి,్త జీవీఆర్‌ఎస్ కిశో ర్ తదితరులతోపాటు సిబ్బంది తక్షణ వైద్యసేవలు అందించారు. వైద్యులు పిల్లలకు ఇంజక్షన్లు చేసే సమయంలో వారి ఏడ్పులతో ఆస్పత్రి ప్రాంగణమంతా దద్దరిల్లింది. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు  తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ధైర్యం చెప్పడంతో  ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పూర్తి రాజకీయ అండ ఉండడంతో వారు పెట్టిందే భోజనం, చేసిందే వంట అన్న చందంగా పిల్లలు తినాల్సిందేనని వాపోయారు. ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, తహశీల్దారు కేడీవీ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు  ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.  

 

 ఇంత బాధ్యతారాహిత్యమా?: ద్వారపురెడ్డి శ్రీనివాసరావు...

 ఎమ్మెల్యే స్వగ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులకు ఇంత బాధ్యతారాహిత్యమా..? అంటూ వైస్సార్‌సీపీ నేత ద్వారపురెడ్డి శ్రీనివాస రావు ప్రశ్నించారు. తక్షణమే నిర్వాహకులను విధుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

 

 నిర్వాహకులపై చర్యలు శూన్యం..!

 మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో బాధ్యులైన నిర్వాహకులపై కనీస చర్యలు తీసుకునేందుకు ఇటు రెవెన్యూ, అటు విద్యాశాఖాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్వాహకులపై కనీసం పోలీ సులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం పట్ల ఆయా శాఖాధికారులు రాజకీయ పలుకుబడికి లొంగిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంఈఓ డి.రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా తాను క్యాంపులో ఉన్నానని, తహశీల్దారే సంఘటనను పర్యవేక్షించారని తప్పుకున్నారు. తహశీల్దారును ప్రశ్నించగా మిడ్డేమీల్ విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలోకి వస్తుందని వారే పోలీసులకు ఫిర్యాదు చే యాలని అన్నారు. అయితే సెలవులో ఉన్న హెచ్‌ఎంకు  విద్యాశాఖాధికారులు చార్జి మెమో ఇవ్వడం కొసమెరుపు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top