ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..

ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..


గుత్తి: ఎట్టకేలకు యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించగలిగారు. ఆస్తి కోసం సోదరుడే... రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని హత్య చేసినట్లు తేలింది.  ఈ యేడాది ఏప్రిల్‌ 19న గుత్తి మండల పరిధిలోని వన్నేదొడ్డి సమీపంలో రైల్వే ట్రాక్‌ వద్ద గ్రామానికి చెందిన లోకేష్‌(19) అనే యువకుడు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది. ఎవరు హత్య చేశారో తెలియలేదు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌ పై పడేశారు.



గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం కేసును సివిల్‌ పోలీసులకు బదిలీ చేశారు. అయినా హత్యా మిస్టరీ వీడలేదు.  ఎట్టకేలకు రెండు మాసాల తర్వాత హంతకుని కాల్‌ డేటా ఆధారంగా హత్యా మిస్టరీని పోలీసులు శుక్రవారం చేధించారు. లోకేష్‌ను అతని సోదరుడు రైల్వే ఉద్యోగి(గ్యాంగ్‌మెన్‌) శ్రీనివాసులు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని కొందరు వన్నేదొడ్డి గ్రామస్తులు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారణ వేగవంతం చేశారు.



పోలీసుల విచారణలో సొంత సోదరుడే లోకేష్‌ను అతి కిరాతకంగా కొడవలితో ముక్కలు ముక్కలుగా నరికి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు తేలింది. దీంతో నిందితుడు(హంతకుడు) శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో తానే తన తమ్ముడిని ఆస్తి కోసం హత్య చేసినట్లు అన్న అంగీకరించినట్లు తెలిసింది. తమ్ముడిని హత్య చేస్తే ఆస్తి అంతా తనకు దక్కుతుందనే దురుద్దేశంతో శ్రీనివాసులు లోకేష్‌ను వన్నేదొడ్డి ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొడవలితో అతి దారుణంగా హత్య చేశాడు.



ఆత్మహత్యగా చిత్రీకరించాలనే నెపంతో మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. తాపీగా ఇంటికెళ్లిపోయాడు. మృతుని తండ్రి సుంకన్న రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. అయితే గత ఐదు సంవత్సరాల క్రితం తండ్రి వీఆర్‌ఎస్‌ ఇచ్చి పెద్దకుమారుడు శ్రీనివాసులకు ఉద్యోగం ఇప్పించాడు . చిన్న కుమారుడు లోకేష్‌కు పది లక్షల నగదు, ప్లాట్లు, ఇళ్లు రాసి ఇచ్చాడు. లోకేష్‌ను హంతమొందిస్తే ఆస్తితో పాటు నగదు మొత్తం తనకే వస్తుందనే దురాశతో పథకం ప్రకారం తమ్ముడిని అతిదారుణంగా హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశాడు. అయితే ఫోన్‌ కాల్‌ డేటా హంతకున్ని పట్టించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top