ప్రత్యేక హోదా తెస్తారా? తేలేరా?

ప్రత్యేక హోదా తెస్తారా? తేలేరా? - Sakshi


ఏపీ సీఎం చంద్రబాబుకు విపక్షనేత వైఎస్ జగన్ సూటి ప్రశ్న

 

హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురిచేస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోననే భయంతో కొందరు ఆత్యహత్యలు కూడా చేసుకుంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 15 నెలలు దాటింది. ప్రత్యేక హోదా తెస్తారా... తేలేరా? తేల్చి చెప్పండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి డెడ్‌డైన్ ఇవ్వగలరా? హోదా ఇవ్వనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మీ మంత్రులను ఉపసంహరించుకుంటామనే దమ్ము, ధైర్యం ఉన్నాయా?’’ అని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై మంగళవారం రాష్ట్ర శాసనసభలో ప్రకటనపై జరిగిన చర్చలో జగన్ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రత్యేక హోదాను ఎందుకు తేలేకపోయారో, ఇప్పటివరకు ఏమి చేశారో, ఇంకా ఎంతకాలంలో తెస్తారో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. సభకు సమర్పించిన నోట్‌లో లేనివన్నీ చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలముందు ప్రత్యేకహోదా తమ వల్లనే సాధ్యమని చెప్పి, ఎన్నికలయ్యాక ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయి, దాన్నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. హోదావల్ల రాష్ట్రానికి నిధులు ఎక్కువగా వస్తాయని, రాయితీలు వస్తాయని, దానివల్ల పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని వివరించారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....

 

 అబద్ధాలు... అర్ధసత్యాలు...

 పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఉపసంహరించుకున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు అబద్ధాలు, అర్ధసత్యాలతో మాపై అభాండాలు వేశారు. 2013 డిసెంబర్, 2014 ఫిబ్రవరిలో మొత్తం 19 రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 14 రోజుల్లో 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. ఒక్కరోజూ అనుమతించలేదు. 2013 డిసెంబర్‌లో లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నందున ఆరోజుకు అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుంటున్నామని, రేపు తిరిగి ప్రవేశపెడతామని స్పీకర్‌కు లేఖ రాశా. ఒకవేళ మేము అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కు తీసుకోకుండా ఉంటే లోకాయుక్త, లోక్‌పాల్ బిల్లుకు జగన్ వ్యతిరేకమని బండ వేసేవారు కాదా? వాస్తవానికి అదే సమయంలో రాష్ట్రంలో కిరణ్ సర్కార్‌ను విప్ ఇచ్చి కాపాడింది ఎవరు? మీరు కాదా? కిరణ్‌ను కాపాడతారు మాపై నిందలు వేస్తారా? 294 మంది సభ్యులున్న సభలో 148 మంది మెజారిటీ కావాల్సి ఉంటే ఆవేళ కిరణ్‌కు 146 మందికి మించి లేరు. ఆవేళ కిరణ్ సర్కార్ గట్టెక్కడానికి కారణం చంద్రబాబు కాదా?  

 

 ఎన్నికలముందు ఏం చెప్పారు?

 రాష్ట్ర విభజనవల్ల హైదరాబాద్‌వంటి నగరాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు... 70శాతం పరిశ్రమలు, 90శాతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నందువల్ల... సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అప్పటి ప్రధాని పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే... ఐదేళ్లుకాదు, పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చింది. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు కలిసి ఇచ్చిన హామీని ఈవేళ ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇదేనా పార్లమెంటు విశ్వసనీయత? ప్రత్యేకహోదా మాతోనే సాధ్యమని చంద్రబాబు, పదేళ్లు అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఊరూరా ఊదరగొట్టారు. బేషరతుగా రుణమాఫీ, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు ఇవ్వకపోతే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగభృతి, ప్రత్యేకహోదా... గోడలనిండా, టీవీలనిండా, చంద్రబాబుగారి ఉపన్యాసాలనిండా ఇవే హామీలు. ప్రత్యేకహోదాను బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ ఎన్నికలయ్యాక ఆ హామీలన్నీ మర్చిపోయారు. వాస్తవానికి సీఎంకు ప్రత్యేక హోదాపై అవగాహన లేదు. నేను ఈ జనరేషన్, చంద్రబాబు గత జనరేషన్. మేం హోంవర్క్ చేస్తాం, ప్రతిదానికీ డాక్యుమెంట్ చూపిస్తాం. ఆయనకు ఆ పని చేసే తీరిక, ఓపిక ఉండదు. తనకు తెలిసిందే ఎక్కువనుకుంటారు. ఈ మధ్య ఆయన ఎక్కువగా ఓటుకు కోట్లుపైన ఎక్కువ హోంవర్క్ చేస్తున్నారు.

 

 హోదా ఎందుకు అవసరమంటే...

 ప్రత్యేకహోదావల్ల రెండు ప్రధాన మేళ్లు జరుగుతాయి. పార్లమెంటు సభ్యులకు సమాచారం ఇచ్చే సంస్థ పార్లమెంటు రీసెర్చ్ సెంటర్‌నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి... ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి కేంద్రం నిధులను 90 శాతం గ్రాంటుగా ఇస్తుంది. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం రుణంగా ఇస్తుంది. అంటే హోదా ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో గ్రాంటు 90శాతం, రుణం 10శాతంగా ఉంటుంది. గ్రాంట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రాష్ట్రంపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు 30శాతం గ్రాంటు మాత్రమే ఉంటుంది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇన్‌కంటాక్స్, కార్పొరేట్ టాక్సు రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఉంటాయి. ఉదాహరణకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 11వ షెడ్యూల్ పేరానంబర్ 10లో... హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి నీటి పారుదల పథకాలున్నాయి. ఇవి పూర్తి కావాలంటే కనీసం రూ.8 వేల కోట్లు కావాలి. ప్రత్యేక హోదా ఉంటే వీటికి 90 శాతం గ్రాంట్ వస్తుంది. లేకుంటే 25 నుంచి 50 శాతమే వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే విజయవాడ, విశాఖల్లో మైట్రో-రైలు ప్రాజెక్టులకు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని చేపడితే ఆ నిధుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది. (ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడ్డుతగులుతూ హోదాపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 1980 నుంచి 30 శాతమే గ్రాంట్లు వస్తున్నాయని... 2010 నుంచి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు తీసేశారని చెప్పారు.)

 ప్రత్యేకహోదా వస్తుందనుకుంటే తనవల్లే వచ్చిందని చెప్తారు. రాదనుకుంటే... అది వచ్చినా వేస్టు, దానివల్ల ఉపయోగంలేదని మభ్యపెడతారు. ఈ విషయంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారు.

 

 ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే...

 ప్రత్యేక హోదా కలిగిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.70 వేల కోట్ల రూపాయల గ్రాంటు ఇచ్చారు. ఆ రాష్ట్ర జనాభా కేవలం 1.25 కోట్లు మాత్రమే. 2014 మార్చి ఒకటిన రాష్ట్రం విడిపోయింది. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి ప్రణాళిక సంఘానికి ఉత్తర్వులు పంపి 18 నెలలు అయింది. మే నెలలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏడు నెలలకు డిసెంబర్‌లో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. ఆ ఏడు నెలలు ప్రత్యేక హోదా తీర్మానం అక్కడే పడి ఉంది. అయినా రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు. హోదాపై ముఖ్యమంత్రి, మంత్రులు చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు. 14వ ఆర్థిక సంఘం వద్దన్నదనీ, పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు అడుగుతున్నాయని సాకులు చెబుతున్నారు. కొందరైతే ప్రత్యేక హోదా రద్దయిందంటున్నారు. కానీ మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం మేరకు ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఆ సౌకర్యం ఉపసంహరించలేదు. అయినా ప్రత్యేక హోదా బ్రహ్మాపదార్థమేమీ కాదు. అది ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని ఓ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారు. కేబినెట్‌కు, ప్రణాళికా సంఘానికీ, ఎన్‌డీసీకి, నీతి ఆయోగ్‌కీ ప్రధానే అధిపతి. ప్రధాని, కేబినెట్ తలుచుకుంటే హోదా ఇచ్చేయవచ్చు. కానీ ఏపీకి హోదా ఇవ్వాలని కేబినెట్ ఆమోదం పొందినా, ప్లానింగ్ కమిషన్‌కు పంపినా.. ఎవ్వరూ పట్టించుకోరు. (ఈ సందర్భంగా బాబు జోక్యం చేసుకుంటూ... పీఆర్‌ఎస్ ఓ ప్రైవేటు సంస్థనీ, ఆ సమాచారాన్ని తీసుకొచ్చి అదేదో జీవో అన్నట్టు సభలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.)

 

 బాబు ఔట్‌డేటెడ్ పాలిటీషియన్

 చంద్రబాబుకు అనుకూలంగా హిందూలో జీఆర్ రెడ్డి రాసిన దాన్నైతే ఉదహరిస్తారు గానీ నేను పీఆర్‌ఎస్ సెంటర్ వివరాలు చెబితే తప్పా? ప్రపంచంలో ఎక్కడైనా రెండు రెళ్లు నాలుగే. లెక్కలు ఎక్కడైనా లెక్కలే. బోల్తా కొట్టించే కార్యక్రమం నుంచి బయటపడి పోరాడే పని మొదలు పెట్టండి. పీఆర్‌ఎస్ ఫైనాన్స్ విభాగం ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉంటుంది. అక్కడున్న మేధావులు సలహాలిస్తే వీళ్ల కంటికి కనబడడం లేదు. చంద్రబాబుతో వచ్చిన చిక్కేమిటంటే... ఆయన ఔట్ డేటెడ్ పాలిటీషియన్. ఎప్పుడో పాతకాలంలో చదివిన వ్యక్తి. ఆయన సగం తెలిసీ సగం తెలియని నాలెజ్డ్‌తో ఆయన చెప్పడం, ఈసభ వినడం. మన కర్మ ఇట్లా తయారైపోయింది. కాస్త వింటే మంచిది. (చంద్రబాబు జోక్యం చేసుకుని... ‘నేనేదో ఔట్‌డేటెడ్ పాలిటీషియన్ అని, ఆయనొక్కడే తెలివైనవాడననీ చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఐటీని ప్రోత్సహించిందే నేను’ అని చెప్పారు.) తెలియని విషయాన్ని చక్కగా చదివి వినిపిస్తుంటే తెలుసుకోవడానికి బదులు ఎదురుదాడేమిటి? గుజరాత్ లా కళాశాల నుంచి తెప్పించిన సమాచారం ఇది. ఇది వినిపించినా తప్పేనా? ఇంకా నయం సెల్ ఫోనే నేను కనిపెట్టానని చంద్రబాబు చెప్పినా వినాల్సి వస్తుందేమో.

 

 వెన్నుపోటు పొడిచిన రోజే...

 సరిగ్గా 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇదేరోజు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈవేళ మాకు విలువల గురించి చెప్పడం, మేము వినాల్సిరావడం ఖర్మ కాకుంటే ఏమనుకోవాలి! సుమారు 64 ఏళ్ల తర్వాత ఫైనాన్స్ కమిషన్ రద్దయి నీతి ఆయోగ్ వచ్చింది. దానికీ ప్రధానే అధ్యక్షుడు.. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల రూ.30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. 130 శాతం పరిశ్రమలు వచ్చాయి. 490 శాతం ఉపాధి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌కు పది వేల పరిశ్రమలు, ఉత్తరాఖండ్‌కు రెండు వేల పరిశ్రమలు వచ్చాయి. ప్రత్యేక హోదా వస్తే పదేళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు ఉండవు. ఐదేళ్ల పాటు ఆదాయ పన్ను ఉండదు. మరో ఐదేళ్ల పాటు 70 శాతం మినహాయింపు ఉంటుంది. రవాణా వ్యయం రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా ఏపీకి వస్తే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. 976 కి.మీ. కోస్తాతీరం ఉంది. అపార అభివృద్ధికి అవకాశం ఉంటుందని నేను చెబుతుంటే వినే ఓపిక లేకుంటే ఎలా? కొందరు మంత్రులు జీఎస్‌టీ బిల్లు వస్తుంది గనుక పన్నులు రావని ప్రచారం చేస్తున్నారు. ఆర్టికల్ 279 ఏ ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రొవిజన్ ఉంటుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌తో మేలే జరుగుతుంది.

 

 కేసు వల్లే బాబు వెనకడుగు

 ఇన్ని ప్రధానాంశాలున్నా, రాష్ట్రానికి ఇన్ని ప్రయోజనాలున్నా ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాటం చేయడంలేదంటే.. పట్టిసీమనుంచి ఇసుక మాఫియాదాకా పర్సెంటేజీలు తీసుకుంటూ.. మట్టినుంచి బొగ్గుదాకా కమీషన్లు తీసుకుంటూ... జీవో22నుంచి సెలెక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదాకా.. సెలక్టివ్‌లీ డిస్టిలరీ లెసైన్సులు ఇచ్చేదాకా... డబ్బులు దండుకొని... ఆ బ్లాక్‌మనీతో తెలంగాణలో 8మంది ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి... దాన్నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకహోదాను ఫణంగా పెట్టి మోదీ కాళ్లదగ్గర సాష్టాంగపడుతున్నారు. ఓటుకు నోట్లు కేసులో దొరికిపోవడం వల్లే దీనిపై చంద్రబాబు పోరాడడం లేదు. ఓటుకు నోట్ల కేసు చార్జిషీటులో 22 సార్లు బాబు పేరు పెట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణలో ఏమన్నారో వినండి.. ‘మావాళ్లు.. దే బ్రీఫ్‌డ్ మీ.. ఐ ఆయ్ విత్ యూ, డోంట్ బాదర్, పర్ ఎవ్రీ థింగ్ ఐ యామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్ వుయ్ విల్ హానర్... ఫ్రీలీ యుకెన్ డిసైడ్.. నోప్రోబ్లమ్ ఎట్ ఆల్. దిసీజ్ అవర్ కమిట్‌మెంట్, నో ప్రాబ్లమ్.. వుయ్ విల్ వర్క్ టు గెదర్.’ దీన్ని ఫోరెన్సిక్ రిపోర్టుకు పంపారు.



 (ఈ సందర్భంగా స్పీకర్ మైకు కట్ చేసి ధూళిపాళ్ల నరేంద్రకు ఆ తర్వాత మంత్రి కామినేని శ్రీనివాస్, రావెల, కాల్వ శ్రీనివాసులుకు ఇచ్చారు. వారు జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ... తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు. కేసీఆర్‌తో లాలూచీ పడి కుట్ర చేస్తున్నారని, జగన్, హరీశ్‌రావు ఎక్కడ కలిసి కుట్ర చేశారో తనకు తెలుసునని చెప్పారు.)

 

 ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు...


 ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారిమీద ప్రేమ చూపుతున్నట్లు చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారు. చనిపోయిన వారిపేర్లు ప్రస్తావించకుండా సంతాప తీర్మానం చేయడం నేను ఎన్నడూ చూడలేదు. తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న మునికోటి కుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి ఇంకా ఇవ్వలేదు. ఆత్మహత్య చేసున్న లక్ష్మయ్య, ఉదయభాను, లోకేష్, చంద్రశేఖర్ కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వలేదు. వారి మరణానికి కారకులెవరు? ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రానికి హోదా సాధనకు నిర్దిష్ట హెచ్చరికతో గడువుపెట్టండి. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. చనిపోవడంవల్ల ఎవరూ ఏమీ సాధించేది ఉండదు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందాం. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతను నేను మరీ మరీ కోరుతున్నా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top