వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉజ్వల భవిత


* జగన్ జన్మదినోత్సవంలో మేకపాటి   

* పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపు

* పార్టీ కార్యాలయంలో కేక్ కట్‌చేసి జగన్ జన్మదిన వేడుకల నిర్వహణ

* హాజరైన పార్టీ ముఖ్య నేతలు.. పలువురు ఎమ్మెల్యేలు, నేతల రక్తదానం

* అంధ, అనాథ విద్యార్థులకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ చేసిన నేతలు



సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందనీ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు శ్రేణులంతా కృషి చేయాలని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేకపాటి మాట్లాడుతూ.. పార్టీ అధినాయకుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని.. ఆయన రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉండాలని.. అన్ని విధాలా అందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.



అంతకుముందు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం ఏర్పాటు చేసిన పెద్ద కేక్‌ను మేకపాటి కోసి వేడుకను ప్రారంభించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు కేక్‌ను పరస్పరం తినిపించుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తల ‘జై... జగన్’ నినాదాల మధ్య జన్మదిన కార్యక్రమం సాగింది. జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు పార్టీ నేతలు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయంలో పార్టీ తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, తిరువీధి జయరామయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి (తెలంగాణ), పార్టీ కార్యదర్శులు చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డిలతో పాటు 110 మంది రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం వారి సొసైటీకి అందించారు. అనాథ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ‘చీర్స్’ ఫౌండేషన్ సంస్థకు పార్టీ తరఫున పది వేల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు. అంధ విద్యార్థులకు దుప్పట్లు, అనాథ విద్యార్థులకు పుస్తకాలు తదితరాలను ఈ సందర్భంగా పంచిపెట్టారు.



జగన్ జన్మదినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ముఖ్య నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.ఎన్.వి.ప్రసాద్, ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, వంతెల రాజేశ్వరి, పాలపర్తి డేవిడ్‌రాజు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, విశ్వాసరాయి కళావతి, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రపుల్ల రెడ్డి. మేకా ప్రతాప అప్పారావు, అత్తారు చాంద్‌బాషా, జంకె వెంకటరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, తెలంగాణ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, కార్యవర్గ సభ్యుడు కె.శివకుమార్, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top