బాలురే టాప్

బాలురే టాప్ - Sakshi


     పదో తరగతి ఫలితాల్లో మళ్లీ పైచేయి

     90.86 శాతంతో జిల్లాకు 11వ స్థానం


 

సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పరీక్షల్లో బాలురు సత్తా చాటారు. జిల్లాలో పైచేయి సాధించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలకు పైగా తరగతులు జరగలేదు. కానీ గత డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ప్రణాళిక ఫలితంగా 90.86 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాకు 11వ స్థానం దక్కింది. 2009-10లో  16వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కో మెట్టూ అధిగమిస్తూ.. గతేడాది 13వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఏకంగా రెండు మెట్లు అధిగమించడం గమనార్హం.

 

మళ్లీ బాలురదే పైచేయి!



ఈ ఏడాది జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 62,265 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ప్రయివేటు విద్యార్థులు 11,369 మంది ఉన్నారు. రెగ్యులర్ కేటగిరీలో 50,896 మందికిగాను పరీక్షలకు గైర్హాజరైనవారు, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడి డిబారైనవారిని తీసివేయగా 50,685 మంది ఫలితాల కోసం నిరీక్షించారు. వీరిలో 90.86 శాతంతో 46,053 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 26,126 మందిలో 91.04 శాతంతో 23,784 మంది, బాలికలు 24,559 మందిలో 90.68 శాతంతో 22,269 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో బాలుర హవా నడుస్తోంది. ప్రయివేటు కేటగిరీలో 11,369 మందికిగాను సుమారు 65 శాతంతో దాదాపు 7,500 మంది ఉత్తీర్ణులైనట్టు సమాచారం. అధికారిక సమాచారం ఇంకా విద్యాశాఖకు రావాల్సి ఉంది.

 

49 స్కూళ్లలో శతశాతం ఉత్తీర్ణత



జిల్లాలోని 49 ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో యలమంచిలి, పాడేరు డివిజన్లో సుమారు 30 పాఠశాలలున్నాయి. మిగిలినవి అర్బన్ డివిజన్లో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు కేటగిరీలో 10,656 మంది ఆంగ్లమాధ్యమంలో పరీక్షలు రాశారు. 94 శాతంతో సుమారు 10 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ప్రభుత్వ కే టగిరీలోని సక్సెస్ స్కూళ్లలో చదువుతున్నవారే సుమారు 5 వేల మంది విద్యార్థులున్నట్టు సమాచారం. గతేడాది పదికి పది గ్రేడ్ పాయింట్ల సగటు(జీపీఏ) సాధించిన

విద్యార్థులు 37 మంది.

 

ఈ సారి మాత్రం ఈ సంఖ్య ఏకంగా 147కు చేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ.. 10 జీపీఏ సాధించిన వారు మాత్రం తక్కువే. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది 9.8 జీపీఏ సాధించినవారున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రయివేటు/కార్పొరేట్ పాఠశాలల్ని మినహాయిస్తే.. నగరంలోని శాక్రడ్ హార్ట్స్ ఎయిడెడ్ హైస్కూల్, చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్, అనకాపల్లిలోని సీతానగరం జెడ్పీ హైస్కూల్‌లో ఒక్కో విద్యార్థి 10కి 10 జీపీఏ సాధించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top