విద్యార్థి దూకాడా.. పడిపోయాడా?


రేకెత్తిస్తున్న అనుమానాలు

బాలుడి పరిస్థితి విషమం


 

తిరుపతి క్రైం/తిరుచానూరు: బైరాగిపట్టెడలోని రవీం ద్రభారతి పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థి కింద పడ్డాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు లు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం మేరకు పద్మావతిపురంలో నివాసముంటున్న మునస్వామిరెడ్డి, మహేశ్వరి దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కొడుకు హరికృష్ణారెడ్డి ఉన్నారు. హరికృష్ణారెడ్డి(15) 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం 6.30 గంటల కు స్టడీ అవర్ ఉందంటూ పాఠశాలకు వచ్చాడు. వెళ్లిన అరగంటలో అనుమానాస్పద స్థితిలో మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు  విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న మునస్వామిరెడ్డి రక్తపు మడుగులో ఉన్న తన కుమారుడిని చూసి గుండెలు బాదుకుంటూ 108కి ఫోన్ చేయండంటూ చెప్పడంతో అప్పుడు ఆ పాఠశాల యాజమాన్యం 108కు సమాచారం ఇచ్చి రుయాకు తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్‌లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పైనుంచి కిందపడడంతో ఎడమ చేయి, కాలు, పక్కటెముకలు విరిగాయి. విద్యార్థి పైనుంచి పడిన తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రమాదవశాత్తు కింద పడ్డాడా? లేక కావాలనే దూకాడా? ఎవరైనా తోశారా? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. విద్యార్థి మేడపై నుంచి పడడం బాధాకరమని పాఠశాల సిబ్బం ది పేర్కొంటున్నారు. వైద్య ఖర్చులు ఎంతైనా తామే  భరిస్తామని వారి తల్లిదండ్రులకు తెలిపారు.



 యాజమాన్యం నిర్లక్ష్యం

 విద్యార్థిపై అంతస్తు నుంచి పడి చాలా సమయమైనప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు ఆరోపించారు. వారు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే హరికృష్ణ పరిస్థితి విషమంగా మారిందని మండిపడ్డారు. కనీస భద్రతా వ్యవస్థ లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. సంబంధిత విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలు పాటించని ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యార్థి చికిత్సక య్యే ఖర్చును పాఠశాల యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జె.విశ్వనాథ్, నరేష్, చలపతి, దాము, తేజ, చంద్ర పాల్గొన్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top