ప్రాణాలు తీసిన ఫ్రెండ్‌షిప్‌ డే

ప్రాణాలు తీసిన ఫ్రెండ్‌షిప్‌ డే - Sakshi


- ఆలస్యంగా ఇంటికి వచ్చిన విద్యార్థిని మందలించిన తల్లిదండ్రులు

- మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

- 24 గంటలు అనాథగా మిగిలిపోయిన మధు శవం


కాశీబుగ్గ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం ఏమిటని అడిగినందుకు చిన్నబోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. ఈ హృదయవిధారక సంఘటన పలాసలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.



పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు పద్మనాభపురం కాలనీలో చెంచాన రాజేంద్ర, జ్యోతి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుమారుల్లో పెద్దవాడు చెంచాన మధు(21). ఇతడు కాశీబుగ్గలోని శ్రీమేధ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పట్టణంలో వెంకటేశ్వర థియేటర్‌ వెనుక భాగంలో దాబా నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు.



మధు చదువులో అంతంతమాత్రంగా రాణించడంతో తల్లిదండ్రులు బాగా చదువుకోమని నచ్చజెప్పేవారు. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన మధు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా చక్కని దుస్తులు ధరించి స్నేహితులతో కలిసి పలాసకు 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న శివసాగర్‌ బీచ్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి సైతం ఇంటికి రాకుండా రాత్రి 8 గంటలకు చేరుకున్నాడు. ఉదయం వెళ్లి ఇప్పటివరకు రాకపోవడంపై తల్లిదండ్రులు మందలించారు. బుద్ధిగా చదువుకోకుండా బీచ్‌లలో తిరుగుళ్లేమిటని ఆగ్రహించారు.



ఈ విషయం మధుకు రుచించక ఇంట్లో వారితో మాట్లాడకుండానే ఆ రాత్రి నిద్రించాడు. మనస్తాపానికి గురైన ఇతడు సోమవారం ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలాస నుంచి సున్నాదేవి వైపు ఉన్న రైలు మార్గంలో గుర్తుతెలియని రైలు కింద తలపెట్టి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే జీఆర్‌పీ సిబ్బంది హెచ్‌సీ పి.కోదండరావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్టేషన్‌కు తరలించారు.



మొహం పోల్చుకునే రీతిలో లేకపోవడంతో మృతుని తల్లిదండ్రులు పనిచేస్తున్న దాబా పక్కనుంచే పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి 24 గంటలు అనాథ శవంగా వదిలేశారు. రోజంతా మధు కనబడక తల్లడిల్లిన తల్లి జ్యోతి స్నేహితులతో ఆరా తీయించింది. కుటుంబ సభ్యులు, బంధువులతో వెతికించారు. ఈ తరుణంలో కొంతమంది స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతి అనే విషయం పత్రికల్లో రావడాన్ని తెలియజేశారు. దీంతో మంగళవారం ఉదయం మధు కుటుంబ సభ్యులంతా పలాస ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.



తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. చదువుకోమని చెప్పినందుకే ఆత్మహత్య చేసుకుంటావా అంటూ తల్లి మధు మృతదేహంపై పడి విలపించిన తీరు అక్కడివారికి కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం కాశీబుగ్గ టెలిఫోన్‌ ఎక్చేంజ్‌కు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top