సొమ్ము కాంగ్రెస్‌ది.. సోకు టీడీపీది..!


గజపతినగరం రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స అప్పలనర్సయ్య గురువారం నామినేషన్ వేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా భారీగా జన సమీకరణ చేశారు. అసలే నియోజకర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతేనని సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శకుల నోళ్లు మూయించడానికి నాయకులు సన్నద్ధమయ్యారు. భారీగా జన సమీకరణ చేసి, తమ బలమేంటో నిరూపించుకోవాలని భావించారు.

 

అందులో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచీ జనాలను పెద్ద ఎత్తున తరలించారు. మరి జనాలు ఊరకనే వస్తారేంటి? మనిషికి ఒక బిర్యాని పొట్లాం.. వంద రూపాయల నోటు చేతిలో పెట్టారంట. బిర్యానీ, వంద నోటు పోతే పోయింది గానీ.. జనాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సైతం ఫుల్ ఖుషీ అయ్యారంట.ఇంత వరకూ బాగానే ఉంది గానీ.. అదేరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గజపతినగరం వచ్చారు. వస్తూవస్తూనే నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

 

‘అమ్మో.. మా నాయకులు జనాన్ని భారీగా తరలించారే..’ అని చంద్రబాబు సైతం ఫుల్ జోష్ అయ్యారంట. అయితే అసలు విషయం ఏంటంటే.. మధ్యాహ్నం అప్పలనర్సయ్య నామినేషన్‌కు తరలి వచ్చిన జనం.. ‘ఎలాగూ గజపతినగరం వచ్చాం కదా.. పనిలో పనిగా సాయంత్రం జరిగిన చంద్రబాబు సభను చూసి వెళ్దామ’ని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు వచ్చిన వారంతా చంద్రబాబు సభకు తరలివెళ్లారు. ఆ జనం లేకుంటే చంద్రబాబు సభ సైతం వెలవెలబోయేదే.ఇది చూసిన కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. ‘సొమ్ము మాది.. సోకు వాళ్లదా’ అంటూ లబోదిబోమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top