ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాలలో ఎంట్రీ ట్యాక్స్

ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాలలో ఎంట్రీ ట్యాక్స్


 హైదరాబాద్‌ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాలకు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రవాణా, సరుకుల వాహనాలపై విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇదివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో మార్చి 31వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా ఉండాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగియడంతో రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు ప్రయత్నించగా వీలుపడలేదని సమాచారం. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణా మంత్రి మహేందర్‌రెడ్డిలు ఓ దఫా సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరిపేందుకు విముఖత చూపారు.



ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఎంట్రీ ట్యాక్స్ విధించడానికి వీల్లేదన్న ఏపీ వాదనలు తెలంగాణ పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు మూడు నెలలకు అదనంగా రూ.30 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ముఖ్యంగా స్టేజి క్యారియర్లుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సులపై పన్ను భారం పడనుంది. దీంతో ప్రైవేటు బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రైవేటు ఆపరేటర్లు ఏప్రిల్ 1తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లపై ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీ విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులుబాటు లేదు. 


కాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు అనునిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. నల్గొండ నుంచి సిమెంటు, ఇతర ప్రాంతాల నుండి సరుకుల వాహనాలు ఏపీకి వస్తాయని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఎంట్రీ ట్యాక్స్ విధించక తప్పదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ట్యాక్స్ విధించడం వల్ల మూడు నెలలకు చెల్లించే క్వార్టర్లీ పన్ను కొంత వరకు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ ఎంట్రీ ట్యాక్స్ వసూలుపై ఏపీ రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నత స్థాయిలో తీసుకునే ఈ నిర్ణయంపై తాము మాట్లాడబోమని నిరాకరించడం గమనార్హం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top