ఎందుకో?ఏమో?

ఎందుకో?ఏమో? - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం: అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై  విరుచుకు పడే ఆయన.. మీడియా సమావేశమంటే ముందుండే ఆయన.. హుద్‌హుద్ తుఫాన్ తదనంతర పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. ఎందుకో గానీ ఒక్కసారిగా మౌనవ్రతాన్నే ఆశ్రయించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  తనకేమీ పట్టనట్టు కొన్నాళ్లుగా గుంభనంగా ఉంటున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ తరఫున గట్టిగా మాట్లాడే నేతలు కరువయ్యారు.  

 

 ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమయం దొరికినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ప్రెస్‌మీట్లు, పార్టీ సమావేశాల పేరుతో సర్కార్ పాలనను ఎండగడుతున్నారు. కానీ, ఆ తర్వాత స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రం ఇటీవల కాలంలో ఆ దిశగా స్పందించడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన రుణమాఫీతో రైతులు దగా పడ్డారని తెలిసినప్పటికీ నోరు మెదపలేదు. తనకొక ఎజెండా ఉందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సందర్భంలో బొత్స బీజేపీలో చేరుతారని, ఇప్పటికే మంతనాలు జరిగాయని, భారీ జన సమీకరణతో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని...ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది.

 

 కానీ, వాటిని నేరుగా బొత్స ఖండించే ప్రయత్నం చేయలేదు. కనీసం  ఆయన అనుచర వర్గమైనా ఖండించడం లేదు. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే బొత్స కూడా పార్టీ కార్యక్రమాలకు అంతగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. మీడియాలో కన్పించే సందర్భాలు కూడా అరుదుగా ఉన్నాయి. జిల్లాలోనే ఉన్నా బయటికి రావడం లేదు. స్థానికంగా లేనట్టుగానే ఉంటున్నారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తూ  డీసీసీబీ, రావివలస సొసైటీ అక్రమాల విషయమై ఫోకస్ పెంచారు. మరిశర్ల తులసిని ఇరకాటంలో పెడితే మొత్తం బాగోతమంతా బయటపడుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

 

 అటు శాఖా పరమైన విచారణతో పాటు సీబీసీఐడీ విచారణకు ఆదేశించేలా చంద్రబాబు ఒత్తిడి చేశారు. వారనుకున్నట్టుగానే విచారణలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. వీటిపై కూడా బొత్స కనీసం స్పందించలేదు. దీంతో ఆయనను అనుసరిస్తున్న నేతల పరిస్థితి అయోమయంగా తయారైంది. కనీస సంకేతాలు ఉండడం లేదని, ఏం జరుగుతుందో తెలియడం లేదని,  ఆయన వ్యూహమేంటో పసిగట్టలేకపోతున్నామంటూనే...ఏదో జరుగుతోందని మాత్రం చెప్పుకొస్తున్నారు. ఈ  డైలమాకు   ఎప్పుడు తెరపడుతుందో తెలియదు గానీ అంతా ఉత్కంఠగానే చూస్తున్నారు.  

 

 టీడీపీ నేతల ఉలికిపాటు

 ఇదిలా ఉండగా బొత్స బీజేపీలో చేరితే తమకు ఇబ్బందులొస్తాయని టీడీపీ నేతలు కూడా ఉలిక్కి పడుతున్నారు.   కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల ఆ పేరు చెప్పి జిల్లాలో మరో పవర్ సెంటర్‌గా తయారై తమకు  ఏకుమీదమేకులా తయారవుతారని అంతర్మథనం చెందుతున్నారు.  మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే బొత్స బీజేపీలోకి వెళ్తున్నట్లుందని ఒకరిద్దరు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top