అపోహలు వద్దు

అపోహలు వద్దు - Sakshi


సాక్షి, కడప : మారుమూల గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మల్లెపల్లె బసిరెడ్డి జిల్లాకు చెందిన వారే. పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో తొలి విడతలోనే ఆర్టీఓగా ఖమ్మంలో బాధ్యతలు నిర్వర్తించి డీటీసీగా వచ్చిన బసిరెడ్డికి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. పదవ తరగతి నుంచి బీటెక్ వరకు జిల్లాలోనే చదువుకున్న ఆయన జిల్లా రవాణాశాఖ అధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాహనాల యజమానులు ఆధార్‌కార్డు అందించే ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అపోహాలు పడవద్దంటూనే ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. ఆధార్‌కార్డు అనుసంధానంతో ఎలాంటి ఇబ్బందులు వాహనదారులకు ఉండవన్నారు.

 

 అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడతామని, ఇప్పటికే దళారుల వ్యవస్థ శకం ముగిసిందని....ఎంవీఐలు కూడా పద్ధతి మార్చుకుని వ్యవహరించాలని హెచ్చరిస్తున్న బసిరెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...

 సాక్షి :  డీటీసీగా బాధ్యతలు చేపట్టారు. అనుబంధం ఉన్న ఈ జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది?

 డీటీసీ : నేను పుట్టింది అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో.  అవ్వగారి ఊరైన పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామంలో ఆరంభమై నల్లపురెడ్డిపల్లెలో పదవ తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియేట్ పులివెందుల, బీటెక్ కడప కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశాను. ఎంటెక్ తిరుపతిలో చదివాను. దీంతో నాకు జిల్లా పరిస్థితిపై అవగాహన ఉంది. జిల్లా ప్రజలు మంచివారు. నాకున్న అనుభవంతో ఉత్తమ సేవలు అందించగలను.

 సాక్షి : ప్రస్తుతం పెట్రోలు బంకుల్లో ఆధార్ కార్డు అనుసంధానమంటూ వాహన యాజమానులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి?

 బసిరెడ్డి: అలాంటిదేమీ లేదు. ఆధార్, లెసైన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు మాత్రమే అడుగుతున్నాం. తీసుకు రాకపోతే తర్వాత తీసుకు రావాలని చెబుతున్నాం.

 సాక్షి : ఆధార్ అనుసంధానం ద్వారా సంక్షేమ పథకాలు, ట్యాక్సులు, రేషన్‌కార్డులు తొలగిస్తారని ప్రజలు భయపడుతున్నారు?

 బసిరెడ్డి: ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అపోహాలు వదిలేయండి. మాకు సహకరించండి. ఇప్పటికే స్వచ్ఛందంగా చాలామంది ఆధార్‌కార్డులు తీసుకుని పెట్రోలు బంకుల వద్దకు వస్తున్నారు. ఎలాంటి చర్యలు ఉండవు. వాహనాల వ్యవహారానికి సంబంధించిన విషయం మాత్రమే... బయపడవద్దు.

 

 సాక్షి: జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్ని పెట్రోలు బంకుల్లో అమలు చేస్తున్నారు?

 బసిరెడ్డి: జిల్లాలో మొదటి విడతగా 55 పెట్రోలు బంకుల్లో మెప్మా వారితో కలిసి ఆధార్ సేకరిస్తున్నాం. ఒక్కొక్క ఎంవీఐకి ఏడు నుంచి ఎనిమిది బంకులను కేటాయించాం. ముందుగా జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభించాం. ఆధార్ అనుసంధానం పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. రెండవ విడతలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేపడతాం.

 

 సాక్షి : జిల్లాలో వాహనాలు ఎన్ని ఉన్నాయి? లెసైన్సుల సంఖ్య ఎంత?

 బసిరెడ్డి : జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల (అన్ని రకాలు కలిపి) పైచిలుకు వాహనాలుంటే....అంతకంటే ఎక్కువగానే లెసైన్సులు మంజూరు అయ్యాయి.

 సాక్షి : లెసైన్సులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి దళారీ వ్యవస్థ కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి?

 బసిరెడ్డి: దళారుల వ్యవస్థకు కాలం చెల్లింది. లెసైన్సులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కేవలం ఒక్కరోజులోనే కార్డులను జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. వారంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్రత్యేకంగా ఒక పోస్టల్ కవరును కూడా రూపొందించాం. తద్వారా ఎవరిదైనా కార్డు పోస్టుద్వారా ఇంటికి పంపినా యజమాని లేని సందర్భంలో పోస్టల్‌కు సంబంధించి వ్యక్తి కూడా ఆప్షన్లు పూర్తి చేసి అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

 

 సాక్షి : జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం, రాయచోటి, బద్వేలు, కడప ప్రాంతాలలో అధిక లోడుతో వాహనాలు వెళుతున్నా పట్టించుకోని పరిస్థితిపై మీరేమంటారు?

 బసిరెడ్డి: ప్రస్తుతం ఆధార్‌తో బిజీగా ఉన్నాం. త్వరలోనే అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై చర్యలు తప్పవు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక లోడు వాహనాలను అరికడతాం.

 

 సాక్షి : జిల్లాలోని అన్ని ఎంవీఐ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? అయితే కొన్నిచోట్ల అవి పనిచేయడం లేదు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరదు కదా?

 బసిరెడ్డి: అవినీతి, దళారుల వ్యవస్థ నిరోధానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పనిచేయలేదని తెలిసింది. ప్రత్యేకంగా సంబంధిత ఆపరేటర్‌ను పిలిపించి మాట్లాడాం. పనిచేయని ప్రాంతాలలో త్వరలోనే కొత్తవి సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

 సాక్షి : కొంతమంది ఎంవీఐలు కేటాయించిన ప్రాంతాల్లో ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉంటూ వస్తూపోతూ మధ్యలో వాహనాలను పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి?

 బసిరెడ్డి : ఎంవీఐలకు ఇప్పటికే చెప్పాం. పద్దతి మార్చుకోండి.... అలా వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు.  నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.

 సాక్షి : కడపలోని డీటీసీ కార్యాలయంలో గతంలో ఐదు లక్షల నగదు గల్లంతు వ్యవహారం చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

 బసిరెడ్డి : గతంలో జరిగిందేదో జరిగింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఐదు లక్షలు రికవరీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాడుగ, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లులు, స్పీడ్ పోస్టు, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్, హోంగార్డులకు సంబంధించిన జీతాలు కూడా ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా అకౌంట్లలో వేసేందుకు చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేశాం.

 

 సాక్షి : టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కాకుండా బర్త్ సర్టిఫికెట్లు ఎలా పడితే అలా డాక్టర్ల ద్వారా తెస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమంటారు?

 బసిరెడ్డి : దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రొద్దుటూరు, కడపలో పలువురు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లతో చర్చించాం. ఖచ్చితంగా పదవ తరగతి సర్టిఫికెట్‌పై సంబంధిత పాఠశాల హెడ్‌మాస్టర్ అటెస్ట్‌డ్‌తోనే స్వీకరిస్తాం. అందుకు సంబంధించి ఎంవీఐలకు కూడా ఆదేశాలు ఇచ్చాం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top