నిండుకుండలు

నిండుకుండలు - Sakshi

  • సరిహద్దు జలాశయాల్లో పుష్కలంగా నీరు

  •  బలిమెలలోకి 24 టీఎంసీలు కొత్తగా చేరిక

  •  ఏపీవాటాగా 72 టీఎంసీలు

  •  నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష

  • సీలేరు/ముంచంగిపుట్టు :  జిల్లాను అతలాకుతలం చేసిన హుదూద్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని జలాశయాలకు మాత్రం మేలు చేసింది. తుపాను కారణంగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే బలిమెల జలాశయంలోకి 24 టీఎంసీల వరదనీరు చేరిందని ఏపీజెన్‌కో సీలేరు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ టీఎల్ రమేష్‌బాబు తెలిపారు.



    ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్, డుడుమ(డైవర్షన్) డ్యామ్‌లోకి భారీగా వరద నీరు చేరింది. తుపాను అనంతరం తొలిసారిగా ఒడిశా బలిమెలలో సరిహద్దు నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారులు శుక్రవారం సమీక్షించారు. నీటి వినియోగంపై లెక్కలు కట్టారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 124 టీఎంసీల నీరు ఉండగా ఇందులో ఏపీకి 72.8564 టీఎంసీలు, ఒడిశాకు కేవలం 51.4136 టీఎంసీలు నీరు ఉన్నట్టు నిర్ధారించారు.



    తుపానుకు ముందు 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 24 టీఎంసీలు పెరిగినట్టు లెక్కలు కట్టారు. ఈ నీటితో రానున్న 4 నెలలపాటు విద్యుదుత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని జెన్‌కో అధికారులు వెల్లడించారు. అదే విధంగా మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి డిమాండ్ లేదని, 6మిలియన్‌యూనిట్లు(ఎంయూ) విద్యుదుత్పత్తి అవుతోందని పేర్కొన్నారు.

     

    ప్రమాద స్థాయిలో బలిమెల : బలిమెల జలాశయం నిండుగా ఉంది. తుపానుకు ప్రమాదస్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి అడుగు తేడాతో ప్రస్తుతం కళకళలాడుతుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1515 అడుగులకు చేరుకొంది. మరో అడుగు నీరు చేరితే నీటిని విడిచి పెట్టాల్సిందే. అదే విధంగా జోలాపుట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2750అడుగులు. ప్రస్తుతం 2749.45 అడుగుల నీరుంది. సీలేరులో 1360 అడుగులకు1352.1 అడుగుల నీరు చేరింది. డొంకరాయి 1037 అడుగులకు 1035.4 అడుగుల నీరుంది.  



    స్పిల్‌వే డ్యాం నుంచి డుడుమ(డైవర్షన్) డ్యాంకు  ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యాంలో 2585.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుజనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 1,2,3 జనరేటర్లతో 50 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. జోలాపుట్టుకు నీరందించే మత్స్యగెడ్డలు నీటితో కళకళలాడుతున్నాయి.



    ఈ సమావేశంలో ఏపీ జెన్‌కో సూపరిండెంట్ ఇంజినీర్ ఈఎల్ రమేష్, ఏడీ భీమశంకరం, ఏడీటీ సురేష్‌తోపాటు ఒడిశా బలిమెల హైడ్రో ప్రాజెక్టు జనరల్ మేనేజర్ పిఎన్ పాండా, డిప్యూటీ మేనేజర్ (ఎలక్రికల్) జ్యోతిబసు, నీటి వనరుల విభాగం ముఖ్య నిర్వహణ ఇంజినీర్ మహంతిదాస్ పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top