బోనస్ పెంచాలని కార్మికుల సమ్మె


కాసిపేట : దీపావళి బోనస్ పెంచాలని డిమాండ్ చేస్తూ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికులు శనివారం సమ్మె చేశారు. పర్మినెంటు, లోడింగ్ కార్మికులకు రూ.17,500 ఇప్పించి, కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.8,500 మాత్రమే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో పర్మినెంటు కార్మికులతో సమానంగా బోనస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం విభజించి పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తాడని ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్ రాములునాయక్ యూనియన్‌ను గెలిపిస్తే ఆదిలోనే ఇలా అన్యాయం చేశారని అసంతృప్తి వెల్లగక్కారు.

 

మాజీ ఎమ్మెల్యే మద్దతు..



కార్మికుల నిరసనకు వివిధ కార్మిక సంఘాల నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మద్దతు ప్రకటించారు. గేటు ముందు కార్మికులు చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రూ.20వేలు అడ్వాన్సు చెల్లిస్తామని చెప్పి గెలిచిన అనంతరం కార్మికులకు తెలియకుండ హైదరాబాద్‌లో యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడం దారుణమన్నారు. కార్మికులకు కనీసం రూ.15వేల బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాగజ్‌నగర్ ఎస్పీఎంలో గెలిచిన టీఆర్‌ఎస్ యూనియన్ కంపెనీని మూసే ప్రయత్నం చేస్తోందన్నారు.



గుర్తింపు సంఘం టీఆర్‌ఎస్ యూనియన్ నాలుగు నెలలకే కార్మికులను విస్మరించడం దారుణమన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని, కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. యూనియన్ల నాయకులు వడ్లూరి మల్లేశ్, తిరుపతిరెడ్డి, గంట మల్లారెడ్డి, లచ్చిరెడ్డి, ప్రకాష్‌పటేల్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు.

 

సమానంగా బోనస్ చెల్లించాలి




కాసిపేట : దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ సమానంగా బోనస్ చెల్లించాలని తెలంగాణ ఆసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజన్న డిమాండ్ చేశారు. శనివారం దేవాపూర్‌లో కార్మికుల నిరసనకు మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సమగ్రమైన చట్టంకోసం కార్మికులంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. కంపెనీ యాజమాన్యం, గుర్తింపు సంఘం కాంట్రాక్టు కార్మికులను వర్గీకరించి సీనియర్ కార్మికులకు రూ.10వేలు, మిగతా వారికి రూ.8500 చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు. టీఏకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top