బొజ్జల, ఎంపీ శివప్రసాద్‌ గైర్హాజరు

బొజ్జల, ఎంపీ శివప్రసాద్‌ గైర్హాజరు - Sakshi


అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్‌ గైర్హాజరు అయ్యారు. కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జల అలకబూనగా, తమను పట్టించుకోవడం లేదంటూ ఎంపీ శివప్రసాద్‌ బాహాటంగానే ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


కాగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో  టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్‌ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెర మీదకు వచ్చారు.


టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే బుజ్జగింపుల పర్వంలో బొజ్జల మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top