టీడీపీ మేనిఫెస్టోనే బోగస్

టీడీపీ మేనిఫెస్టోనే బోగస్ - Sakshi


నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి



 వాకాడు : తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక బోగస్‌ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజాకంటక ప్రభుత్వంపై ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారన్నారు. వాకాడులోని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో బుధవారం రాత్రి ఆ పార్టీ అనుబంధ మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డికి ప్రసన్నకుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రసన్న విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి నాయకులు, కార్యకర్తలే కొండంత బలమన్నారు.



తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల తరపునపోరాటం చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తరువాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా చంద్రబాబు ఇచ్ని వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. అధికారానికి కొంచెం దూరంలోనే వైఎస్సార్‌సీపీ నిలిచినప్పటికీ ప్రజల ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందన్నారు.



జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి అనుబంధ సంస్థల కమిటీలను నియమిస్తున్నామన్నారు. పార్టీని ఇంకా పటిష్ట పరిచి జిల్లాలో తిరుగులేని శక్తిగా చేస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రకటించారు. అనుబంధ కమిటీ అధ్యక్షులంతా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. రెండు నెలలకు ఒకసారి సమావేశం జరిపి అజెండాను రూపొందించుకుని ప్రజల తరపున పోరాడాలని సూచించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనుబంధ సంస్థల కమిటీలు పూర్తయ్యాయన్నారు.



అనుబంధ సంస్థల కమిటీ సభ్యులందరూ  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పటిష్టానికి మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. కొత్త రాజధాని కోసం పంటలు పండే భూములు లాగేసుకుని రైతులకు అన్యాయం చేస్తే ఆగోష్ఠ చంద్రబాబుకు తగులుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏర్పాటు చేయబోయే కొత్త రాజధాని చుట్టూ చంద్రబాబు అనుచరులకు రూ.కోట్లు సంపాదించి పెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనని విమర్శించారు.



చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామాని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. జిల్లాలో సరైన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సముచిత నిర్ణయమన్నారు. వచ్చే నెల 5న  కలెక్టరేట్ ఎదుటజరగనున్న ధర్నాను విజయ వంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సాసీపీ మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, కొండారెడ్డి నందగోపాలరెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి, పిట్టు నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీలా, కడూరు భాస్కర్, అజిత్‌కుమార్‌రెడ్డి, రవీంద్రనాయుడు, తుమ్మల మోహనాయుడు, దుష్యంతయ్యశెట్టి, రవిశేఖర్‌రెడ్డి, తీపలపూడి చెంగయ్య, ఎంబేటి సురేష్, నాగేంద్రరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోటేశ్వరరెడ్డి, పల్లంపర్తి గోపాలరెడ్డి, కాశీపురం శ్రీనివాసులు, కాటంరెడ్డి రామలింగారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top