నెత్తుటి మరకలు

నెత్తుటి మరకలు - Sakshi


నగరంలో 6 నెలల్లో 10 హత్యలు

►  వరస సంఘటనలతో జనం బెంబేలు

►  ప్రశ్నార్థకంగా శాంతిభద్రతలు




ప్రియుడి చేతిలో ప్రియురాలు హతం.. భర్త చేతిలో భార్య హత్య.. యువకుడిని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. అంటూ తరచుగా వస్తున్న వార్తలతో విశాఖ ప్రజలు హడలిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంఘటనలు పోలీస్‌ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. ప్రశాంత తకు మారు పేరుగా భావించే విశాఖలో ఇటీవల పెరుగుతున్న నేర ప్రవృత్తి ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని,  నేరాలు, ఘోరాలు నామ మాత్రమని ఇన్నాళ్లూ అంతా భావించేవారు. ఇటీవల హత్యలు, హత్యాయత్నాలు, ప్రేమోన్మాదుల ఘాతుకాలుఎక్కువయ్యాయి. ఎక్కడో చోట అఘాయిత్యాలు చోటు చేసుకుంటూ నగరంలో అశాంతి, అలజడి రేపుతున్నాయి.



సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం:

నగరంలో రోజురోజుకు ఉన్మాదుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో వరుస ఘటనలతో వీరు భీతిల్లుతున్నారు. హత్యలు, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారుల మాటలు వట్టివేనని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి.



శివారు ప్రాంతాలు, నగర నడిబొడ్డు అన్న భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉన్నాయి. గడచిన ఆరు నెలల కాలంలోనే పదిమంది హత్యకు గురవడం శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం పడుతోంది. నగరంలో తమ ప్రత్యర్థులను హతమార్చడం ఎంతో సునాయాసమైపోయింది. ఒకప్పుడు ఎక్కడైనా ఒక హత్య జరిగితే విశేషంగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు అదే పనిగా హత్యలు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది.



నగరం అభివృద్ధి మాటెలా ఉన్నా ఇప్పుడు నేరాలు, ఘోరాల్లో మాత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి ఇటీవల జరుగుతున్న సంఘటనలను తార్కాణంగా నిలుస్తున్నాయి. నగరంలో పోలీసు వ్యవస్థపై భయం సన్నగిల్లడం వల్లే హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షణకు సరిపడినంత సిబ్బంది లేరని పోలీసు అధికారులు చెబుతున్నారు. విశాఖ కమిషనరేట్‌ పరిధిలో 3 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది అవసరం కాగా సుమారు 2400 మంది మాత్రమే ఉన్నారు.



కమిషనరేట్‌ పరిధిలో గతంలో 13 పోలీస్‌ స్టేషన్లుండేవి. కొత్తగా మహారాణిపేట, ద్వారకానగర్, ఎంవీపీ పోలీస్‌ స్టేషన్ల రాకతో అవి 16కు చేరాయి. కొత్త స్టేషన్లు ఏర్పడ్డా వాటికి అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. ప్రస్తుత సిబ్బందినే వీటిలో సర్దుబాటు చేశారు. కమిషనరేట్‌లో చేరడానికి ప్రస్తుతం 310 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 226 మంది సివిల్, 84 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ పూర్తయ్యాక వీరిలో ఎంతమంది విధుల్లో చేరతారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో రౌడీషీటర్లను, నేరస్తులను కట్టడి చేయడం, వారిపై నిఘా పెట్టడం కష్టతరమవుతుందని, ఫలితంగా నేరాల నియంత్రణ కష్టసాధ్యమవుతోందని పోలీసు అధికారులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. గతంకంటే పెట్రోలింగ్‌ వ్యవస్థ కూడా అంతగా చురుగ్గా లేదని అంటున్నారు.



ఇటీవల జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని..

2017 ఫిబ్రవరి 11 నక్కవానిపాలెం, పీఅండ్‌టీ కాలనీ, గాంధీనగర్‌లో ఆస్తి తగాదాల్లో వంకల సురేష్‌ (37) అనే యువకుడిని సొంత భావ సురేష్‌ హత్య చేశాడు.  



ఏప్రిల్‌ 7వ తేదీ రాత్రి మద్దిలపాలెం, సింగర్‌ బార్‌ వద్ద రౌడీ షీటర్‌ మళ్ల Ððవెంకట రమణను తోటి రౌడీ షీటరును హతమార్చాడు.



జూలై 8న పూర్ణామార్కెట్, పండావీధిలో ప్రియుడు బొందలపూడి సతీష్‌ తన ప్రియురాలు బురళి భవానీని ఇంటికి రమ్మని చెప్పి ఆమెపై చాకుతో పీక కోసి, డంబుల్స్‌తో తలపై మోది మరి కిరాతకంగా చంపేశాడు.



అదే రోజు జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం కండిపూడికి చెందిన పెయింటర్‌ కొప్పాక గణేష్‌ తన భార్య మారుతి కాపురానికి రావటం లేదని కూర్మన్నపాలెం, రాజీవ్‌నగర్‌లో అత్తవారింట్లో ఉన్న ఆమెను, అత్త మొద్దు జమునను బలమైన ఆయుధంతో మోదడంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.  



జూలై 10వ తేదీ రాత్రి గాజువాక మార్కెట్‌ రోడ్డులో ఏడుమెట్ల మర్రిపాలేనికి చెందిన గండేపల్లి ముత్యాలు అలియాస్‌ శ్రీను మాంసం కొట్టు నిర్వాహకుడు హత్య చేశాడు.



►  జూలై 13న  పెదగంట్యాడ మండలం చిన నడుపూరులో భర్త దాకారపు అప్పలరాజు, తన భార్య రామలక్ష్మిని పీటతో ముఖంపై మోది హతమార్చాడు.



గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లారీ కేబిన్‌లోనే క్లీనర్‌ హత్యకు గురయ్యాడు.  



జూలై 18న బీచ్‌రోడ్డు షీ సర్ఫ్‌ అపార్టుమెంట్‌లో క్రేన్‌ వ్యాపారి విక్రమ్‌ ప్రకాష్‌ ధమేజా, అతని భార్య, కారు డ్రైవర్‌పై బీహార్, జార్ఖండ్‌కు చెందిన దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.  



ఈ నెల 19న భీమిలి మండలం టి.నగరపాలెంలో తన ప్రేమను అంగీకరించలేదని పతివాడ హరిసంతోష్, విద్యార్ధిని పొట్నూరి రూప, అడ్డొచ్చిన ఆమె సోదరుడు ఉపేంద్రలపై కిరోసిన్‌ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ హతమయ్యారు.



19 రాత్రి ఆరిలోవ పాండురంగాపురం వద్ద రౌడీషీటర్‌ సాదె వినయ్‌ సంపత్‌ను అతని ప్రత్యుర్ధులు పాత కక్షలతో దాడిచేసి దారుణంగా హతమార్చారు.



మూడేళ్లలో హత్య కేసుల వివరాలు

సంవత్సరం     హత్యలు    పరిష్కారమైనవి    దర్యాప్తులో..

2014              27               21                  5

2015              16               14                  2

2016              32               06                26






సిబ్బంది కొరత ఉంది..

విశాఖలో గతంలో 13 పోలీస్‌స్టేషన్లు ఉండేవి. వాటికి ఎంవీపీ, ద్వారకానగర్, మహారాణిపేట పోలీస్‌ స్టేషన్లతోపాటు సైబర్‌ క్రైం సెల్, సీటీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్లు అదనంగా ఏర్పడ్డాయి. అందుకనుగుణంగా స్టాఫ్‌ పెరగలేదు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సిబ్బంది పెరగక ఉన్నవారినే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. కొంతమందిని ప్రోటోకాల్‌ విధులకు పంపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత వాస్తవం.

ఉన్నవారితోనే నగర శాంతిభద్రతలు అదుపులో ఉంచుతున్నాం. త్వరలో కొత్త 400 మంది కానిస్టేబుళ్లు వస్తున్నారు. దీంతో కొంత కొరత తీరనుంది. ఇప్పటికే నగరంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి ఆదివారం స్టేషన్‌కు పిలిపించి అవగాహన కల్పిస్తున్నాం. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతున్నాం. పోలీస్‌ స్టేషన్లలో రౌడీ షీటర్ల ఫోటోలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశాం.   –దాడి నాగేంద్రకుమార్, నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top