బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు

బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు - Sakshi

  •  12 మంది దుర్మరణం

  •  తూర్పు గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన

  •   ఏడుగురికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

  •   అనధికారికంగా కొబ్బరితోటలో బాణసంచా తయారీ

  •   బాణసంచాలో పొటాష్‌ను ఎక్కువ మోతాదుతో

  •   కూరడంతో పేలుడు?.. షార్ట్ సర్క్యూట్‌వల్ల కూడా

  •   జరిగి ఉండవచ్చని అనుమానం

  •   మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీ విస్ఫోటం

  •   భూకంపం సంభవించినట్టు అదిరిన ఇళ్లు, కొట్టుకున్న

  •   కిటికీలు.. చెల్లాచెదురుగా ఎగిరిపడ్డ శరీర భాగాలు

  •   మూడు గ్రామాల్లో విషాదం... మృతుల్లో ఎనిమిది మంది మహిళలే.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన

  •   ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు

  •   ఘటనపై చంద్రబాబు, వైఎస్ జగన్, రఘువీరా దిగ్భ్రాంతి

  •  

     సాక్షి ప్రతినిధి, కాకినాడ:

     వెలుగుల పండుగకు ముందే బడుగుజీవుల బతుకులు కాలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన భారీ విస్పోటంలో 12 మంది దుర్మరణం పాలవ్వగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు కాకినాడలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులంతా వాకతిప్ప, కుతుకుడుమిల్లి శివారు పెదకలవలదొడ్డి, నిదానందొడ్డి, ఎస్సీ కాలనీలకు చెందిన రెక్కాడితేగాని డొక్కాడని ఎస్సీ, బీసీ వ్యవసాయ కూలీలే. మృతుల్లో పలువురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. సంఘటనా స్థలంలో తొమ్మిది మంది మృతి చెందగా, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకరు, అపోలో ఆస్పత్రిలో ఒకరు, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరొకరు మృతి చెందారు. దీపావళికి మూడు రోజుల ముందు సంభవించిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. వాకతిప్పలోని కొబ్బరితోటలో ఉన్న రేకులషెడ్‌లో కొప్పిశెట్టి వెంకటరమణ కుమారుడు అప్పారావు మణికంఠ ఫైర్‌వర్క్స్ పేరుతో 30 ఏళ్లుగా బాణసంచా తయారీ, విక్రయకేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగా అప్పారావు, తల్లి లక్ష్మి తయారీ కేంద్రానికి బయట టెంట్ వేసి బాణసంచా విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం లోపల 25 నుంచి 30 మంది వరకు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ విస్ఫోటం సంభవించింది. పెనుశబ్దాలతో రెండుసార్లు పేలుడు సంభవించి ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పేలుడు శబ్దం ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల వరకు వినిపించింది. భూకంపం సంభవించినట్టు ఇళ్లు అదిరిపోయి తలుపులు, కిటికీలు కొట్టుకున్నాయి. ప్రజలు ప్రాణభయంతో గ్రామం విడిచిపెట్టి  పిల్లాపాపలతో పరుగులుతీశారు. ఏమి జరుగుతుందో తెలిసేలోపే కొబ్బరితోటలోని బాణసంచా తయారు 

     

     చేస్తున్న పెంకుటిల్లు, రేకుల షెడ్లు భస్మీపటలమయ్యాయి. మంటలు ఎగసిపడి 20 అడుగుల ఎత్తున ఉన్న కొబ్బరిచెట్లు కూడా కాలిపోయాయి. పేలుడు ధాటికి మృతుల శరీరభాగాలు సమీపంలోని పంటపొలాలు, కొబ్బరి తోటల్లో చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. పేలుడు 3 గంటల ప్రాంతంలో జరగగా, 20 నిమిషాలసేపు బాణసంచా పేలుతూనే ఉన్నాయి. అరగంటలో మొత్తం కాలిబూడిదైపోయింది. మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడి ఘటనా స్థలం మరుభూమిని తలపించింది. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న వారిని రక్షించేందుకు స్థానికులు తొలుత సాహసించలేకపోయారు. మందుగుండు సామగ్రి ఒకదాని తరువాత మరొకటి పేలుతుండ డంతో అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. మంటలు తగ్గుముఖంపట్టాక కొందరు ధైర్యం చేసి మంటల్లో ఉన్నవారిపై నీళ్లు చల్లి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. క్షతగాత్రుల శరీరం ముక్కలు ముక్కలుగా ఊడిపోతుండటంతో గోనెసంచుల్లో వేసుకుని బయటకు తీసుకురావడం స్థానికుల హృదయాలను కలచివేసింది.

     

     క్షణాల్లో శవాలగుట్ట

     అప్పటివరకు పచ్చని పంటపొలాలు, కొబ్బరి చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా శవాలగుట్టగా మారిపోయింది. కళ్లుతెరిచేలోపే జరగరాని దారుణం జరిగిపోయింది. ఏమి జరిగిందో తెలిసేలోపే యజమాని కొప్పిశెట్టి అప్పారావు పేలుడు ధాటికి ఎగిరి దూరంగా పడ్డాడు. అతని కాలు విరిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతని తల్లి లక్ష్మి స్వల్పగాయాలతో బయటపడింది. మంటల్లో కాలిపోతున్న వారు కాలిపోతున్నట్టుగానే పరుగులుతీశారు. సంఘటనా స్థలానికి సమీపంలో పచ్చని వరిపొలాలు, కొబ్బరితోటలు రక్తమోడాయి. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే.

     

     మూడు గ్రామాల్లో విషాదం

     ఈ దుర్ఘటనతో కుతుకుడుమిల్లి శివారు నిదానందొడ్డి, పెదకలవలదొడ్డి, వాకతిప్ప శివారు ఎస్సీ కాలనీల్లో విషాదం అలముకుంది. ఎస్సీ కాలనీకి చెందిన ఐదుగురు, నిదానందొడ్డికి చెందిన ఐదుగురు, పెద కలవలదొడ్డికి చెందిన ఒకరు ప్రమాదంలో మృతి చెందారు. ఇరుగుపొరుగు గ్రామాల్లో ఒకేసారి ఇంతమంది మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్లెదుటే కాలిపోయిన తమవారిని తలుచుకుంటూ బంధువులు కుమిలిపోతున్నారు.

     

     పొటాష్ కూరుడే కారణం..!

     ఈ ఘటనను దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్  ప్రమాదవశాత్తు జరిగిందని ప్రకటించారు. దీపావళి దగ్గరపడటం ఆర్డర్ ఎక్కువగా ఉండటంతో కార్మికులను ఎక్కువమందిని పెట్టి బాణసంచా తయారుచేస్తున్నారు. బాంబులలో ఉపయోగించే పొటాష్‌ను ఎక్కువ మోతాదుతో కూరడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఉంటుందని అగ్నిమాపక శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. బాణసంచా తయారీతోపాటు అప్పటికే తయారుచేసి హోల్‌సేల్‌గా విక్రయానికి సిద్ధం చేసిన సుమారు రెండు టన్నుల సరుకు కూడా తయారీ కేంద్రంలోనే ఉండటంతో ఈ భారీ విస్పోటం సంభవించిందనే వాదన కూడా వినిపిస్తోంది. లేకుంటే అంతటి ప్రాణనష్టం సంభవించేది కాదంటున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ పేలుడు సంభవించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

     

     అనుమతిపై భిన్నాభిప్రాయాలు

     ప్రమాదం నుంచి బయటపడి, ప్రస్తుతం కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఫైర్‌వర్క్స్ యజమాని అప్పారావును అడగ్గా తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పాడు. కాగా గత మార్చి నెలతోనే అతని లెసైన్సు గడువు ముగిసిందని, ఇంకా రెన్యువల్ చేయించుకోలేదని, అనధికారికంగానే తయారీ జరుగుతోందని కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం అన్ని అనుమతులున్నాయని, సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పారు. అనంతరం కాకినాడలో ఒక ప్రకటన విడుదల చేస్తూ లెసైన్సు గడువు పూర్తయ్యిందని, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లెసైన్సు లేని బాణసంచా కేంద్రాలను మూసివేయాల్సిందిగా జిల్లా ఎస్పీలను ఆదేశించామన్నారు. ఇదిలా ఉండగా, లెసైన్సు రెన్యువల్ కానప్పుడు స్థానిక తహశీల్దార్, ఎస్‌ఐ, అగ్నిమాపక అధికారులు ఎలా తయారీకి అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం తనిఖీలు చేసి ఉన్నా ఈ విషయం బయటపడి ఇంత ప్రమాదం జరిగేది కాదంటున్నారు. 

     

     మృతుల వివరాలు

     వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన ద్రాక్షారపు కాంతం(55), ద్రాక్షారపు చినబుల్లి(50), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి(30), మసకపల్లి కుమారి(25), మసకపల్లి అప్పాయమ్మ(50), మసకపల్లి పుష్ప (42), ఉలంపర్తి కామరాజు(40), అర్జిల్లి రత్నం(28), ఉండ్రాజపు కీర్తి(24), కుతుకుడుమిల్లి శివారు నిదానందొడ్డికి చెందిన వాసంశెట్టి రాఘవ(35), తుట్టా సత్తిబాబు(20), కాశి అప్పలరాజు(30) మృతి చెందినట్టు గుర్తించారు. తుట్టా మంగ, మసకపల్లి గంగ, తుట్టా నాగమణి, ఆరయుడు రాఘవ, మేడిశెట్టి నూకరత్నం,చుక్కా శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి  తీవ్రగాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

     

     ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

     ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వంగా గీత తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రమాదంపై కలెక్టర్ నీతూకుమారి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణకు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్‌ను విచారణాధికారిగా నియమించినట్టు సోమవారం రాత్రి కలెక్టర్ ప్రకటించారు. 

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top