బీజేపీ వర్సెస్ టీడీపీ

బీజేపీ వర్సెస్   టీడీపీ - Sakshi


కేజీహెచ్ సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్యే విష్ణు

ఆయనపై మూకుమ్మడి దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలోనే మాట్లాడుకోమన్న మంత్రి గంటా

భగ్గుమన్న టీడీపీ, బీజేపీ విభేదాలు




కేజీహెచ్‌ను స్మార్ట్‌గా చేయండి చాలు: ఎమ్మెల్యే విష్ణు

సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేజీహెచ్ సమస్యలను ప్రస్తావించారు. ‘విశాఖను స్మార్ట్‌సిటీగా చేస్తామంటున్నారు. మీకో దండం పెడతాను. ముందు కేజీహెచ్‌ను స్మార్ట్‌గా చేయండి. కేజీహెచ్‌కు నర్సింగ్‌స్టాఫ్‌ను ఎప్పుడు ఇస్తారు? ’అని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు నేరుగా మంత్రి గంటాను ప్రశ్నించారు.

 

అసెంబ్లీలోనే మాట్లాడుకో: మంత్రి గంటా

దీనికి మంత్రి గంటా జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘డిసెంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా. అక్కడే సార్ట్ క్వశ్చన్ కింద అడుగు. ఇక్కడ ఎందుకు?’అని కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

 

విశాఖపట్నం: కేజీహెచ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఇవ్వాలనే విషయాన్ని వదిలేయాలని చెప్పిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి... ఏదైనా అసెంబ్లీలోనే మాట్లాడుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన మంత్రి గంటా...

 

జిల్లాలో తీవ్రతరమవుతున్న టీడీపీ, బీజేపీ మిత్రబేధంలో తాజా పరిణామాలు ఇవీ... జీవీఎంసీ వేదికగా టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. స్మార్ట్‌సిటీ అంశంపై జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్‌లో సమస్యలను ప్రస్తావిస్తూ  ప్రభుత్వ వైఫల్యాన్ని సూటిగా ప్రశ్నించారు. దాంతో సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు  గణబాబు, పీలా గోవింద సత్యన్నారాయణ ఆయనపై ఎదురుదాడి చేశారు. కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఎందుకు కేటాయించరు అన్న ఎమ్మెల్యే విష్ణు డిమాండ్‌పై ఎమ్మెలీ ఎంవీవీఎస్ మూర్తి కలకవరపడ్డారు. చివరగా స్పందించిన మంత్రి గంటా ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించుకోమని నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయపరిచింది. ఈ సమావేశంలో జరిగిన వాడివేడీ సంభాషణలు ఇలా ఉన్నాయి..



మీ మంత్రిని అడగండి: ఎమ్మెల్యేలు గణబాబు, పీలా

బీజేపీ ఎమ్మెల్యే కేజీహెచ్ సమస్యలను ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవిందు సత్యనారాయణ ఒక్కసారిగా ఆయనపై ఎదురుదాడి చేశారు. ‘ హెల్త్ మినిస్టర్ మీ వాడే కదా. ఆయన్నే అడగండి. ఇక్కడ మాట్లాడొద్దు’అని కాస్త కటువుగా సమాధానం చెప్పారు.

 

కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఎప్పుడిస్తారు?  


కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీని మంజూరు చేయని అంశాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేవనెత్తారు. ‘అన్ని వసతులు ఉన్నప్పటికీ కేజీహెచ్‌కు డెంటల్ కాలేజి ఎందుకు ఇవ్వడం లేదు. ఎవరికి ప్రయోజనం కలిగించడానికి ఇలా చేస్తున్నారు?’అని సూటిగా ప్రశ్నించారు.

 

ఆ విషయం ఎత్తొద్దయ్యా..కూర్చో:   మూర్తి


కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ అంశాన్ని లేవనెత్తగానే టీడీపీ ఎమ్మెల్యే ఎంవీవీఎస్ మూర్తి గతుక్కుమన్నారు. ఎందుకంటే ఆయన కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డెంటల్ కాలేజీ ఉంది కదా. ఎమ్మెల్సీ మూర్తి వెంటనే స్పందిస్తూ ‘ కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ విషయం ఇప్పుడు ఎందుకు?...నువ్వు ముందు కూర్చో. ఆ విషయం వదిలేయ్’అని అన్నారు.



ఈ తాజా పరిణామాలు టీడీపీ, బీజేపీల మధ్య విబేధాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ప్రజాసమస్యలను లేవనెత్తితే టీడీపీ మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి చేయడం అధికారులను విస్మయపరిచింది. బీజేపీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే... ఇక సామాన్య కార్యకర్తల గతేమిటని గుసగుసలాడుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top