ఉత్తర్వులే

ఉత్తర్వులే


►  జూనియర్‌ కళాశాలల్లో కానరాని బయోమెట్రిక్‌ విధానం

►  బోగస్‌ హాజరుతో స్కాలర్‌షిప్‌లు మెక్కుతున్న యాజమాన్యాలు!

►  పట్టించుకోని ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు




నెల్లూరు (టౌన్‌) : ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు విధిగా బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్‌ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభం నుంచి బయోమెట్రిక్‌ విధానంలోనే విద్యార్థుల హాజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.



అయితే, జిల్లాలో ఒక్క కళాశాలలోనూ బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ విధానం అమలుకు నిరాకరించే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరి కను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్మీ డియెట్‌ బోర్డు అ«ధికారులు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు.



ఉపకార వేతనాలను మేసేందుకేనా!

జిల్లాలో 121 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 60 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతినెలా రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 స్కాలర్‌షిప్‌ మంజూరవుతోంది. ఈ సొమ్ము కోసం చాలా కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.



కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్‌ చేయించే బాధ్యత తమదేనని భరోసా ఇస్తూ పలు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తరగతుల్లో చేర్చుకుంటున్నాయి. విద్యార్థులు రోజూ కళాశాలకు రాకపోయిన రికార్డులో హాజరు చూపిస్తూ స్కాలర్‌ షిప్పు మొత్తాలను కాజేస్తున్నాయి. మరోవైపు ఇతర విద్యార్థులు తరగతులకు రాకపోయినా హాజరు నమోదు చేసి వారినుంచి వేలకు వేలు దండుకుంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో హాజరు తక్కువగా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు.



అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్‌

జూనియర్‌ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్‌ నంబర్‌ను బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ సొమ్ము విడుదల చేస్తుంది. ఈ దృష్ట్యా ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్‌ యంత్రం చొప్పున కళా శాలల్లో ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఆదేశించింది. ఇవి ఏర్పాటు కాకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) బాధ్యులవుతా రని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేయలేదు.



జిల్లాలో జూనియర్‌ కళాశాలలు       162

కార్పొరేట్‌ కాలేజీలు                      121

ప్రభుత్వ కళాశాలలు                      26

ఎయిడెడ్‌ పరిధిలో                        15

ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు            60 వేలు




సెప్టెంబర్‌ వరకు గడువిచ్చాం

జిల్లాలోని కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్‌ యంత్రాల ఏర్పాటుకు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చాం. అప్పటికి ప్రతి జూనియర్‌ కళాశాలలో బయోమెట్రిక్‌ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ మంజూరు కాదు. బయోమెట్రిక్‌ ద్వారా వచ్చే హాజరునే పరిగణనలోకి తీసుకుంటాం.

– బాబూజాకబ్, ఆర్‌ఐఓ, ఇంటర్మీడియెట్‌ బోర్డు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top