పగలైనా బండి లైట్‌ వెలగాల్సిందే

పగలైనా బండి లైట్‌ వెలగాల్సిందే - Sakshi


ఏప్రిల్‌ 1 నుంచి ద్విచక్ర వాహనాలకు తప్పనిసరి

కొత్త టెక్నాలజీతో సిద్ధమైన కంపెనీలు




సాక్షి, అమరావతి: పగటి పూట రోడ్డుపైన ద్విచక్ర వాహనం లైట్‌ వెలుగుతుంటే ఎదురుగుండా వచ్చేవారు లైట్‌ వెలుగుతోందని చేతులతో సంజ్ఞ చేయడం.. వెంటనే లైటు ఆర్పడం వంటి అనుభవం ఎప్పుడో ఒకసారైనా మనకు ఎదురై ఉంటుంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి ఎవరైనా చెప్పినా లైట్‌ ఆఫ్‌ చేయవద్దు. పగలైనా ద్విచక్ర వాహనం లైటు వెలగాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విక్రయించే వాహనాల్లో ‘ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో)’ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పాత వాహనాలకు వర్తించదు. ఇందుకు అనుగుణంగా ద్విచక్ర వాహన కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. దీని వల్ల ఇక మీ బైక్‌లో హెడ్‌లైట్‌ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్విచ్‌ ఉండదు. బండి ఇంజిన్‌ స్టార్టింగ్‌తోనే లైటు కూడా వెలుగుతుంది. బండి ఇంజిన్‌ ఆపితేనే లైట్‌ కూడా ఆగుతుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.



ఎందుకంటే..

కార్లు, ఇతర భారీ వాహనాలకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు సరిగా కనిపించకపోవడమే ప్రధాన కారణమని పలు నివేదికలు వెల్లడిస్తు న్నాయి. 2014లో జరిగిన ద్విచక్ర రోడ్డు ప్రమాదాల్లో 32,524 ఈ కారణంగానే జరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ద్విచక్ర వాహనాల లైట్‌ పగటి పూటా వెలిగించాలని సూచనలు చేసింది. యూరప్, మలేషియా వంటి చాలా దేశాల్లో 2003 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.



ఇష్టపడని వాహనదారులు

పగలు కూడా బండి లైటు వెలిగే ఏహెచ్‌వో టెక్నాలజీపై కొనుగోళ్లుదారులు ఆసక్తి చూపించడం లేదు. రోడ్డు మీద వెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరూ లైటు వెలుగుతోందని సంజ్ఞలు చేస్తారని, ఇది ఇబ్బందికరం అని ఒక కొనుగోలు దారుడు పేర్కొన్నారు. పగలు కూడా లైటు వెలగడం వల్ల బ్యాటరీ వినియోగం భారంగా మారుతుందని మరో కొనుగోలుదారుడు వాపోయారు. కానీ ఈ వాదనతో కంపెనీలు ఏకీభవిం చడం లేదు. ఇప్పుడు ఏహెచ్‌వో టెక్నాలజీతో బ్యాటరీతో సంబంధం లేకుండా నేరుగా ఏసీ సర్క్యూట్‌ ద్వారా లైట్లు వెలుగుతాయని, దీని వల్ల బ్యాటరీ జీవితకాలంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయా కంపెనీలు అంటున్నాయి.  ఇప్పటికే 2017కి చెందిన కొత్త బండ్లన్నీ ఈ టెక్నాలజీతో విడుదల చేస్తున్నాయని, త్వరలోనే ఏప్రిల్‌ ఒకటవ తేదీ నాటికి అన్ని మోడల్స్‌ ఈ టెక్నాలజీతోనే వస్తాయని వరుణ్‌ మోటార్స్‌ ఈడీ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన  కొత్త విధానాన్ని ఆహ్వానించడం అందరికీ మేలని  పోలీస్, రవాణా శాఖల అధికారులు అభిప్రాయపడు తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top