వెండితెర గుండెల్లో గోదారి


ప్రకృతి అందాలకు చిరునామా గోదావరి సీమ. పచ్చని వృక్ష సమూహాలతో నిండిన పాపికొండలను ఒరుసుకుంటూ.. సన్నటి పాయగా ఉరుకుతూ.. అంతలోనే అఖండ వాహినిగా రూపుదాల్చి.. ఒకచోట మెలికలు తిరుగుతూ.. మరోచోట సుడులు తిరుగుతూ.. వడివడిగా కడలివైపు పరుగులు తీసే తల్లి గోదావరి.. తన పథంలో ప్రకృతి మాతకు కొత్త వన్నెలు అద్దుతోంది. వెండి వేదికలను తలపించే ఇసుక తిన్నెలు.. అణువణువునా హరిత శోభను అద్దుకున్న నేలలు.. నది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన లంకలు.. పాల నురుగుల అలల హోరుతో ఎగసిపడే నీలిసంద్రం.. ఇలా ఈ నదీతీరం అడుగడుగునా అందాల మణిహారమే.

 

 అందుకేనేమో ఇంతటి సౌందర్యరాశి అయిన ఈ నదీమతల్లి అంటే సినీ ప్రపంచానికి ఎంతో మక్కువ. సినిమా షూటింగ్ అనగానే దర్శక, నిర్మాతలు మొదట లొకేషన్ల కోసమే వెతుకులాడతారు. అటువంటి అందాల లొకేషన్లకు ఈ సీమలో కొదవ లేదు. అందుకే ఈ నది బ్యాక్‌డ్రాప్‌గా ఎన్నో సినిమాలు తీశారు. అంతేకాదు.. ఆ నదీజలాలు ప్రవహించిన ఈ నేల.. సినీరంగానికి ఎంతోమంది నటీనటుల్ని, దర్శక, నిర్మాతల్ని కూడా అందించింది. ఇక్కడి యాస.. భాష కూడా సినీ సాహిత్యంలో చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే..  గోదారి వెండితెర గుండెల్లో కొలువు తీరింది.

 

 కంబాలచెరువు (రాజమండ్రి) :సినీ వినీలాకాశంలో గోదావరి అంటే ఎనలేని మక్కువ.. సెంటిమెంట్. ఈ నది నీళ్లు తాగి ఇక్కడ నుంచి వెళ్లినవారంతా చలనచిత్రరంగంలో తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరిలో కొందరు రాజకీయాలను శాసించే స్థాయికి కూడా ఎదిగారు. ఈ నదిపై తీసిన ప్రతి సినిమా సిల్వర్‌జూబ్లీ జరుపుకోవాల్సిందే. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన ‘మేఘసందేశం’ దీనికి ఉదాహరణ. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం గోదావరి నది, పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. అంతేకాదు ఆయన గోదావరి నదిపై ఎన్టీఆర్ హీరోగా ‘ఎదురీత’ సినిమా తీశారు. ఇంకా గోరింటాకు, చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. గోదావరి అందాలను తన ‘మూగమనసులు’ సినిమాతో తొలిసారి ప్రపంచానికి చూపిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.

 

 ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్. అప్పటినుంచే సినిమా రంగానికి గోదావరి సెంటిమెంట్ ప్రారంభమైంది. ఈ సెంటిమెంట్‌ను పక్క రాష్ట్రాల చిత్ర పరిశ్రమా ఉపయోగించుకుంది. ప్రముఖ దర్శకుడు బాలచందర్ గోదావరి నదిపై సినిమా సన్నివేశాలు తీసేందుకు తమిళనాడు నుంచి రాజమండ్రి వచ్చారు. ఆడవాళ్లూ మీకు జోహార్లు, తొలికోడి కూసింది అనే సినిమాలు ఇక్కడ తీసినవే. దర్శకుడు కె.విశ్వనాథ్‌కు గోదావరి అంటే పిచ్చి. ఆయన సినిమాలో ఆ నదిలో కొన్ని సన్నివేశాలు తీయాల్సిందే. గోదావరి నది నేపథ్యంలో ఆయన తీసిన శంకరాభరణం, సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, శృతిలయలు, స్వాతికిరణం, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు కమర్షియల్‌గానే కాక ప్రపంచ స్థాయిలో కూడా ఎంతో పేరు తీసుకువచ్చాయి.

 

 బాపు, రమణలైతే వేరే చెప్పక్కరలేదు. వారు 1975లో తీసిన ‘ముత్యాలముగ్గు’ ఎంత హిట్టో చెప్పక్కనక్కరలేదు. గోదావరి నదిపై వారు వంశవృక్షం, బుద్ధిమంతుడు, అందాలరాముడు వంటి ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా గోదావరి సెంటిమెంట్‌ను నమ్ముకున్నారు. ఆయన తీసిన ‘దేవత’ సినిమాలో సన్నివేశాలతోపాటు గోదావరి ఒడ్డున చిత్రీకరించిన ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. అలాగే అప్పటి త్రిశూలం నుంచి మొన్నటి శ్రీరామదాసు వరకూ చాలా సినిమాలు గోదావరితో ముడిపడినవే.

 

 అద్దరి ఈవీవీ

 పశ్చిమ గోదావరి జిల్లావాడైన ఈవీవీ సత్యనారాయణ గోదావరినే నమ్ముకున్నాడు. ఏవండీ ఆవిడ వచ్చింది, సీతారత్నంగారి అబ్బాయి, చాలా బాగుంది, కితకితలు, ఆరుగురు పతివ్రతలు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ వంటి ఎన్నో సినిమాలను గోదావరి బ్యాక్‌డ్రాప్‌లోనే ఆయన తీశారు. ఆయన కుమారుడు, సినీ నటుడు అయిన ఆర్యన్ రాజేష్ మన కడియం మండలం జేగురుపాడు గ్రామానికి అల్లుడే.

 

 ఇద్దరి వంశీ..

 మన జిల్లాలోని పసలపూడికి చెందిన దర్శకుడు వంశీ తీసే ప్రతి సినిమాలో గోదావరి ఉండి తీరాల్సిందే. ఆయన గోదావరి అందాలను తెరకెక్కించే విధానం మాటల్లో చెప్పలేనిది. ఆయన తీసిన సితార, ప్రేమించు పెళ్లాడు, లేడీస్ టైలర్, సంకీర్తన, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి వంటి హిట్ చిత్రాలెన్నో ఈ నదీతీరంలో తీసినవే.

 

 ఈ నీరు తాగితే నటన అదే వచ్చేస్తుంది

 గోదావరికి.. సినిమా పరిశ్రమకు చాలా దగ్గర సంబంధముంది. ఈ నది నీళ్లు తాగితే చాలు.. నటన దానికదే వచ్చేస్తుంది. గోదావరిపై దాదాపు సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించాను. నా తొలి చిత్రం ప్రెసిడెంటు పేరమ్మ, తర్వాత చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’లో నటించాను. గోదావరి నది వద్ద సినిమా తీస్తే అది కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. కె.విశ్వనాథ్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి వంటి ప్రముఖ దర్శకులు గోదావరి నదిపై ఎన్నో చిత్రాలు తీసి విజయబావుటా ఎగురవేశారు. నాకు జీవితాన్నిచ్చింది ఈవీవీ సత్యనారాయణ, కృష్ణారెడ్డి.  గోదావరి నీరు తాగే ప్రాంతాల నుంచి వచ్చిన ఉభయ గోదావరి జిల్లావాసులైన అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీవీ వినాయక్, జయప్రద, వహిదా రెహమాన్, అంజలీదేవి వంటి మహానటులెందరో ఈ గడ్డమీద నుంచి వచ్చినవారే. నా గురువు జిత్‌మోహన్‌మిత్రా గోదావరి ముద్దుబిడ్డే. - అలీ

 

 నా అదృష్టం

 గోదావరి తీరంలో పుట్టడం నా అదృష్టం. అదే నన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. హైదరాబాద్‌లో ఉన్నా గోదావరి ప్రాంతంలో షూటింగ్ అంటే  గంతులేసుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడనుంచి వెళ్లినవారు దాదాపు అందరూ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. మనం వాడే గోదావరి భాషలో కల్మషం లేని మనసులు కనిపిస్తాయి. ఆ నదీమతల్లికి జోహార్లు.

 - గౌతంరాజు

 

 గోదావరిపై తీసిన 70 చిత్రాల్లో నటించాను

 గోదావరినే నమ్ముకున్నాను. చిత్రపరిశ్రమలో నాకు గుర్తింపు వచ్చినా హైదరాబాద్ వెళ్లకుండా గోదావరి ఒడ్డునే ఉండేందుకు ఇష్టపడ్డాను. ఇప్పటివరకూ సుమారు 210 చిత్రాల్లో నటించగా, వాటిలో 70 గోదావరి నదిపై తీసినవే. వాటిలో నేను నటించిన శంకరాభరణం, సిరిసిరిమువ్వ, మేఘసందేశం, ఆనందభైరవి, ఏవండి ఆవిడ వచ్చింది, ముత్యాలముగ్గు, సీతారత్నంగారి అబ్బాయి వంటి ఎన్నో హిట్ చిత్రాలున్నాయి. గోదావరి మాత నన్ను తన ఒడిలో పెట్టుకుని సొంతబిడ్డలా చూసింది. అందుకే నాకు ఆ నది అన్నా, ఆ పరిసరాలు అన్నా అంత ఇష్టం. - జిత్‌మోహన్‌మిత్రా

 

 ఇక్కడ పుట్టడం నా అదృష్టం

 మాది రాజమండ్రిలోని ఇన్నీస్‌పేట. మా నాన్నగారు అమర్‌నాథ్ పాతతరం హీరో. మా అన్నయ్య రాజేష్ సినీరంగంలోకి వెళ్లాడు. తర్వాత వారి వెంట నేనూ వెళ్లాను. ప్రేక్షకులు ఆదరించారు. నాకోసం దర్శకులు వెరైటీతో కూడిన హాస్యపాత్రలు తయారు చేశారు. పుష్కరాలకు రావాలని ఉంది. ఆ గోదావరి మాత ఒడి చాలా చల్లనిది. గోదావరి, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించినా, కొన్ని సీన్లు అక్కడ తీసినా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం సినీ పరిశ్రమలో సెంటిమెంట్‌గా వస్తోంది. గోదావరి ప్రాంతాల్లో తీసిన పలు సినిమాల్లో నేను నటించాను. ఇక్కడ పుట్టడం అనేది నా అదృష్టం.

 - శ్రీలక్ష్మి, ప్రముఖ హాస్యనటి

 

 గోదారి గడ్డపై పుట్టడం నా అదృష్టం

 గలగలా పారే గోదావరి అలలను చూడగానే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. చల్లని గాలులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే గోదావరి నది చెంతన కొద్దిసేపు కూర్చుంటే ఆ రోజు అలసటంతా తీరిపోతుంది. రాజోలు మండలం చింతలపల్లి మా స్వగ్రామం. గోదావరి గడ్డపై పుట్టడం నా అదృష్టం. నేను నటించిన చిత్రాల్లో చాలావరకూ గోదావరి జిల్లాలోనే షూటింగ్ జరిగాయి. ఇక్కడి ప్రజల మధ్య కనిపించే మమతానురాగాలు, ఆప్యాయతలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సంస్కృతీ సంప్రదాయాలు మరెక్కడా కనబడవు. ఇదంతా గోదావరి తల్లి మాహాత్మ్యమే. పుష్కరాల్లో స్నానమాచరించడం నాకు అలవాటే. ఇంతవరకూ రెండు పుష్కరాల్లో గోదావరి స్నానం చేశా. రెండుసార్లు రాజమండ్రిలో స్నానం చేశా. ఈసారి మా స్వగ్రామానికి దగ్గరలో ఉన్న రాజోలు మండలం సోంపల్లిలో కుటుంబ సభ్యులందరితో కలిసి పుష్కర స్నానం చేస్తా.   - కృష్ణుడు

 

 వెండితెరపై గోదారి ముద్దుబిడ్డలు

 గోదారమ్మ ముద్దుబిడ్డలు ఎంతోమంది వెండితెరపై దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. రాజమండ్రికి చెందిన వహీదా రెహమాన్, జయప్రద, భానుప్రియ, జరీనా వహాబ్ వంటివారు టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా బావుటా ఎగురవేశారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వీ రంగారావు, రాజబాబు, రావుగోపాలరావు, కాకరాల, అమర్‌నాథ్, ఆయన కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీలక్ష్మి (ప్రముఖ హాస్యనటి), చిడతల అప్పారావు, రంగనాథ్ (రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో టీసీగా ఉద్యోగం), కృష్ణకుమారి, రేలంగి, అంజలీదేవి, సూర్యకాంతం, షావుకారు జానకి, నేటి తరానికి చెందిన అలీ, చిట్టిబాబు, అనంత్, రావురమేష్, అంజలి, హేమ, గౌతంరాజు, కృష్ణభగవాన్, జిత్‌మోహన్‌మిత్రా, కాకినాడ శ్యామల, కృష్ణుడు, ఎల్బీ శ్రీరాం, ఆర్.నారాయణమూర్తి, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్, దర్శకులు సుకుమార్ తదితరులు మన జిల్లావారే. ఇంకా సాంకేతిక రంగంలో పద్మాలయ స్టూడియోలో 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఆదుర్తి హరనాథ్, ప్రముఖ రచయిత సత్యానంద్.. ఇలా ఎందరో గోదారి తల్లి బిడ్డలు వెండితెరపై వెలుగుతున్నారు.

 

 బాల్యమంతా గోదారమ్మ ఒడిలోనే..

 ప్రముఖ సినీ దర్శకులు బి.సుకుమార్ స్వస్థలం మలికిపురం మండలం మట్టపర్రు గ్రామం. ఆయన చదివింది రాజోలు కళాశాలలో. బాల్యమంతా గోదావరి పరిసర ప్రాంతాల్లోనే సాగింది. చిన్నతనంలో గోదారి గట్ల వెంబడి తిరగడం, చెరువుల చెంత తోటల్లో గడపడం, గోదారి చెంతన స్నేహితులతో కర్రాబిళ్ల ఆటలు, వేసవిలో గోదావరి తీరప్రాంతాల్లో తాటిముంజలు తిని వాటితో బండ్లు కట్టి ఆటలవంటివి తన జీవితంలో మరచిపోలేనివని సుకుమార్ తరచూ అంటూంటారు. ఆయన తొలి చిత్రం ‘ఆర్య’తోపాటు పలు చిత్రాల్లో కూడా ఆయన చిన్ననాటి స్మృతులతో కూడిన గ్రామీణ సన్నివేశాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పటికీ స్వస్థలానికి వస్తే ఆయన గోదారి తీరానికి తప్పనిసరిగా వెళ్తూంటారు.    - మలికిపురం

 

 పుణ్యప్రదం.. పుష్కర స్నానం

 పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరకాలం ఎంతో పుణ్యప్రదమైనది. పుష్కర స్నానం పరమ పవిత్రం. మానవాళిని పునీతం చేస్తుంది. గోదావరి పుష్కర స్నానం పాపాలను నశింపజేస్తుంది. గతించిన పెద్దలకు ఈ సమయంలో తర్పణాలు వదలడం విశేష ఫల దాయకం. గత పుష్కరాలకు కుటుంబ సభ్యులతో కలసి అంతర్వేదివద్ద గోదావరిలో స్నానం ఆచరించాం. పెద్దలతో కలిసి స్నానం చేస్తూ ఎంతో ఆహ్లాదాన్ని పంచుకున్నాం. పురోహితుల మంత్రాల మధ్య గోదావరిలో పూజలు చేశాం. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాం.- బెల్లంకొండ ప్రవీణ్, సినీ కామెడీ ఆర్టిస్ట్, అంతర్వేదికర

 - సేకరణ : సఖినేటిపల్లి


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top