ప్రతిపక్షంపై పక్షపాతం!


- వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి పోలీసుల నామమాత్రపు బందోబస్తు

టీడీపీ మహానాడుకు 2500 మంది.. 

పవన్‌కళ్యాణ్‌ పాల్గొన్న చేనేత గర్జన సభకు సైతం భారీ బందోబస్తు

ప్రతిపక్ష నేత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ కనీస భద్రత కరువు

అన్నీ తామై ప్లీనరీని విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

 

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోలీసుల పక్షపాతం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే సమాచారం ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రభుత్వ పెద్దలకు అందింది. దీంతో ప్లీనరీ సక్రమంగా జరుగకూడదదనే కుట్రపూరిత ఆలోచనలతో పోలీసు బందోబస్తును పూర్తి స్థాయిలో తగ్గించేశారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విషయం పట్టించుకోకుండా, ప్లీనరీకి హాజరయ్యే జనాన్ని అదుపు చేయకుండా పూర్తిగా వదిలేశారు.



ప్లీనరీకి ఎవరూ ఊహించని విధంగా వేలాది మంది జనం హాజరు కావడంతో ప్లీనరీ ప్రాంగణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిశాయి. దీంతో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పలుమార్లు జనాన్ని కూర్చోమంటూ అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు మనకు సహకరించరని, మనమే క్రమశిక్షణతో మెలిగి ప్లీనరీని విజయవంతం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.  

 

అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే...

ప్లీనరీకి రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, భారీ స్థాయిలో హాజరవుతారనే సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే భద్రతను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతానికి పక్కనే మాదిగల కురుక్షేత్ర మహాసభకు మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసు వాహనాన్ని సైతం దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయి ప్లీనరీకి ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, 47 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు, హాజరవుతారని తెలిసినా పదుల సంఖ్యలో పోలీసులను పంపి నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే పక్షపాత ధోరణి అవలంభిస్తుండడం శోచనీయం. 

 

ఒక్కోరి పట్ల ఒకలా..

అధికార టీడీపీ ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి డీజీపీ, అడిషనల్‌ డీజీపీ, ఐజీ, ఎస్పీలు వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో పాటు, సుమారు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే మహానాడుకు బందోబస్తు కొంచెం అధికంగా ఏర్పాటు చేసినప్పటికీ దానిని వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ తప్పుబట్టలేదు. గత ఏడాది వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగిన ప్రాంతంలోనే చేనేత గర్జన జరగడం.. అందులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభకు సుమారు 300 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి అతి తక్కువ మంది పోలీసులను కేటాయించడం చూస్తుంటే ప్రతిపక్షంపై వీరు ఏ స్థాయిలో కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నారో అర్ధమవుతోంది.



ఆ వచ్చిన కొద్ది మందీ దూరంగా చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితం అయ్యారు. అయితే ప్లీనరీకి భారీగా జనం తరలి రావడంతో దీనిపై సమాచారం సేకరించేందుకు మాత్రం భారీ స్థాయిలో ఇంటిలిజెన్స్‌ పోలీసులను మఫ్టీలో మోహరింప చేయడం గమనార్హం. పార్కింగ్, ట్రాఫిక్‌ను అదుపు చేయడం తదితర విషయాలను పోలీసులు అసలు పట్టించుకోలేదు. తుదకు వైఎస్సార్‌సీపీ నేతలే వాకీ టాకీలు పట్టుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, జనాన్ని అదుపు చేస్తూ ప్లీనరీని విజయవంతం చేయడంతో అధికార పార్టీ నేతలు ఖంగు తిన్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top