భూమనకు పెద్దపీట

భూమనకు పెద్దపీట - Sakshi


సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో పెద్దపీట వేశారు. సమర్థవంతమైన నేతగా.. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన భూమనను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.



వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకరరెడ్డి ఆయన చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో కీలక భూమిక పోషించారు. భూమన సమర్థతను గుర్తించి ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని వైఎస్ కట్టబెట్టారు. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారు కొందరి వాడు కాదు.. అందరి వాడు అని చాటిచెప్పడంలో భూమన విజయవంతమయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతి నుంచి శాసనసభకు పోటీచేశారు.



చిరంజీవితో పోటీపడిన భూమన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత.. ఆ కుటుంబానికి భూమన వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్ష, రైతు దీక్ష, ఫీజుపోరు వంటి ప్రతి ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.



2012 ఉప ఎన్నికల్లో తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమన కరుణాకరరెడ్డి అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శాసనసభలో ప్రజాసమస్యలపై తన వాణిని విన్పించారు. రెండేళ్లపాటూ ఎమ్మెల్యేగా పనిచేసిన భూమన తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలను పరిష్కరించారు.



రాష్ట్ర విభజన సమయంలో శాసనసభలో భూమన చేసిన ప్రసంగం మేధావుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన భూమన 2014 ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఓడిపోయారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో దిట్ట అయిన భూమనను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆపార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top