భూమాకు మధుమేహం, రక్తపోటు

భూమాకు మధుమేహం, రక్తపోటు - Sakshi


కర్నూలు వైద్యుల వెల్లడి  

హైదరాబాద్‌కు తరలింపుపై నేడు నిర్ణయం


సాక్షి, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి.. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేసి ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించారు.



జైలుకు రాగానే తనకు గుండె నొప్పి ఉందని భూమా చెప్పడంతో వెంటనే ఆయనను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ సుజాత పరీక్షలు నిర్వహించిన తర్వాత భూమాను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని సూచించారు. అయితే ఎస్కార్టు సమస్య ఉందంటూ పోలీసులు ఆమె సూచనను తిరస్కరించారు. దీంతో భూమా జైల్లోనే నిరసన దీక్షకు దిగారు. శనివారం రాత్రి ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షల తర్వాత ఆయనను కర్నూలు జిల్లా అస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి పేయింగ్ బ్లాక్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.



ఆదివారం ఉదయం, మధ్యాహ్నం వైద్యులు మరోసారి భూమాకు వైద్య పరీక్షలు నిర్వహించంతో రక్తపోటు 180/110, పాస్టింగ్ బ్లడ్‌షుగర్ 168 ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. మధ్యాహ్నం ఆయనకు కడుపునొప్పి రావడంతో మరోమారు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్‌కుగానీ, హైదరాబాద్‌లోని నిమ్స్ లేక కిమ్స్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల బృందం వెల్లడించింది. అయితే దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top