'వేగంగా వెళ్లొద్దని శోభానాగిరెడ్డి పదేపదే చెప్పారు'

'వేగంగా వెళ్లొద్దని శోభానాగిరెడ్డి పదేపదే చెప్పారు' - Sakshi


కర్నూలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన భూమా శోభానాగిరెడ్డి గన్‌మెన్లు శ్రీనివాస్‌, మహబూబ్‌భాషా, డ్రైవర్‌ నాగేందర్‌ కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కారులో ఇరుక్కుపోవడంతో శ్రీనివాస్‌, మహబూబ్‌ భాషాలకు గాయాలయ్యాయని, అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న గన్‌మెన్లు ప్రమాదం జరిగిన తీరును 'సాక్షి'కి వివరించారు.



గత రాత్రి 11:20 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం వెంటనే హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించామన్నారు. శోభానాగిరెడ్డి భర్త భూమా నాగిరెడ్డికి కూడా ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చామన్నారు. రాత్రి 10:50 ప్రాంతంలో నంద్యాలలో బయల్దేరినట్టు చెప్పారు. మితిమీరిన వేగంవల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వేగంగా వెళ్లొద్దని డ్రైవర్‌కు శోభానాగిరెడ్డి పదేపదే చెప్పారని వెల్లడించారు. రోడ్డుపై వరికుప్ప ఉండడంతో డ్రైవర్‌ పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడని, ఈ క్రమంలో వాహనాన్ని నియంత్రించలేకపోయాడని వివరించారు. దీంతో కారు అదుపు తప్పి వరి పొలాల్లోకి నాలుగు పల్టీలు కొట్టిందని తెలిపారు.



మొదటి పల్టీకే శోభానాగిరెడ్డి కారులోంచి దూరంగా పడిపోయారని, మాత్రం వాహనంలోనే చిక్కుకుపోయామని వివరించారు. వెనుక వస్తున్న ఎస్కార్ట్‌... శోభానాగిరెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. రెగ్యులర్‌ డ్రైవర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నిన్న తాత్కాలిక డ్రైవర్‌ వచ్చారని శ్రీనివాస్‌, మహబూబ్‌భాషా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top