భూమా అరెస్ట్ అప్రజాస్వామికం


వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

 

గిద్దలూరు రూరల్ : నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అని వైఎస్సార్  సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. పట్టణంలోని తన నివాస గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు అఖిలప్రియను ఎన్నికల ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఆమెపై దురుసుగా ప్రవర్తించిన అక్కడి పోలీసులను అడ్డుకుని ప్రశ్నించినందుకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించడం చాలా దారుణమన్నారు.



కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి బూటకపు కేసులు బనాయించి పార్టీని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నూల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయంతో ఇటువంటి లోపబూయిష్టమైన పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి పై ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న ఇటువంటి హేయమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. 



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంత అణచాలని ప్రయత్నించినా అంత పైకి లేచే శక్తి పార్టీకి ఉందన్నారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని సమయం చూసి తిప్పి కొడతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ పెద్దబాష, కౌన్సిలర్ శ్రీను,  కంభం ముస్లీం మైనార్టీ నాయకులు మహమ్మద్ మాబు, వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చింతలపూరి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

అరెస్ట్ అక్రమం

 మార్కాపురం :  కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిం దని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

     ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మార్కాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top