అరకు రైలుకు అద్దాల బోగీలు

అరకు రైలుకు అద్దాల బోగీలు


► హెరిటేజ్ సిటీగా భీమిలి

► పాడేరులో బటర్‌ఫ్లై పార్కు

► మే రెండో వారంలో అరకు ఉత్సవ్

► ఆర్ట్ గ్యాలరీగా మార నున్న రాజీవ్ స్మృతి భవన్

►  పర్యాటక ప్రాధాన్యంపై మంత్రి గంటా సమీక్ష


 

విశాఖపట్నం సిటీః విశాఖను పర్యాటక అందాల రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వసతుల కల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుతమున్న పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులను ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక అధికారులతో శుక్రవారం వుడా కార్యాలయంలో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, టూరిజంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బినయ్‌కుమార్ ప్రసాద్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ బాబూరావు నాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జే నివాస్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్, వివిధ శాఖల ముఖ్య ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.



మే నెల రెండో వారంలో అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని నిర్ణయించారు.



సింహాచలం కొండపై రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని అందుకు అభ్యంతరాలపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కొండపై స్టార్ హోటల్ స్థాయిలో కాటేజీలు నిర్మించి భక్తులు, పర్యాటకులు రాత్రి వేళల్లోనూ బస సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని గుర్తించారు.



సముద్రంలో రెండు మూడు రోజుల పాటు విహరిస్తూ ఆనందంగా గడపడానికి అవసరమైన క్రూయిజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.



అరకు ప్రాంతానికి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ప్రస్తుతం నడుస్తున్న 1వీకే ప్యాసింజర్‌కు రెండు అద్దాల బోగీలను జత చేసే ప్రయత్నం పై మళ్లీ కదలిక తెచ్చారు. ఈ సారి ఎలాగైనా రెండు బోగీలను జత చేసేలా ప్రయత్నించాలని మంత్రి గంటా అధికారులను ఆదే శించారు.



భీమిలి పట్టణాన్ని హెరిటేజ్ ప్రాంతంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.



మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హనుమంతవాక వద్ద నిర్మాణమైన విమ్స్‌కు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 30 కోట్లు కేటాయిస్తే ఓ 200 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించవచ్చని సమావేశంలో చెప్పుకున్నారు. అయితే టాటా కేన్సర్ ప్రాజెక్టు వారు ఈ ఆస్పత్రిని కేటాయించాలని కోరుతున్నారని అందుకే ఎటూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా తేల్చిచెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top