ఉద్దేశపూర్వకంగానే ప్రజాభిప్రాయ సేకరణ జాప్యం


హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్లు

 

 సాక్షి, హైదరాబాద్: కడప జిల్లా, కమలాపురం మండలం, పందిళ్లపల్లి, తురకపల్లి, టి.సిదిపిరాళ్ల, యర్రంగుంట్ల మండలం, టి.సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో తమకు కండిషనల్ మైనింగ్ లీజు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఉద్దేశపూర్వక తాత్సారం చేస్తోందంటూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. వీలైనంత త్వరగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన రెండు వ్యాజ్యాల్లో భారతి సిమెంట్స్ కోరింది.



ఈ వ్యాజ్యాలను శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కారణాలతోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని వివరించారు. ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం దురుద్దేశాలతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే తమకు కండిషనల్ మైనింగ్ లీజు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, దసరా సెలవుల నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను వెకేషన్ కోర్టు ముందుంచుతామని తెలిపింది. ఈ నెల 6న ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టాలని కోరుతామని పేర్కొంది. ఈ విచారణ నాటికి ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విషయంలో స్పష్టతతో ఉండాలని, వివరాలను ఆ ధర్మాసనం ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదికి ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top