ప్రదక్షిణం.. ప్రభంజనం

ప్రదక్షిణం.. ప్రభంజనం


గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం

తొలిపావంచా వద్ద ప్రారంభం

32కిలోమీటర్ల మేర కాలినడక


 

గిరి ప్రదక్షిణకు గురువారం భక్తులు పోటెత్తారు. సింహగిరి చుట్టూ భూప్రదక్షిణ చేశారు. భక్తుల సంఖ్య ఉదయం 10 గంటల వరకు నామమాత్రంగానే ఉన్నా తర్వాత నుంచి ఊపందుకుంది. తొలిపావంచా వద్ద ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి అడవివరం, పైనాపిల్‌కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎమ్‌విపికాలనీ, వెంకోజీపాలెం, సీతమ్మదార, పోర్టు స్టేడియం, కప్పరాడ, గోపాలపట్నం మీదుగా సింహాచలానికి 32 కిలోమీటర్ల వరకూ ప్రదక్షిణ సాగింది. పలువురు భక్తులు అప్పుఘర్‌లో సముద్ర స్నానాలు ఆచరించారు. ఈ సారి భక్తుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుందని ఆలయవర్గాల అంచనా.

 

సింహాచలం :  ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం జరిగిన గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేశారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు ప్రదక్షిణ చేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది యువత, మహిళలే 95 శాతం వరకు ప్రదక్షిణలో పాల్గొనడం విశేషం. గిరి ప్రదక్షిణకు సింహాచలం వచ్చే భక్తుల సంఖ్య ఉదయం 10 గంటల వరకు నామమాత్రంగానే ఉన్నా ఆ తర్వాత నుంచి గణనీయంగా పెరిగింది. తొలిపావంచా వద్దకు చేరుకున్న భక్తులు స్వామి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అక్కడి నుంచి అడవివరం, పైనాపిల్‌కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎమ్‌వీపీ కాలనీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, పోర్టు స్టేడియం, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్‌అండ్‌బీ, ఎన్.ఎ.డి కొత్తరోడ్డు, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం వరకు జరిగింది. పలువురు భక్తులు అప్పుఘర్‌లో సముద్ర స్నానాలు ఆచరించారు. ప్రదక్షిణ చేసేందుకు రాత్రి వరకు భక్తులు సింహాచలం వస్తూనే ఉన్నారు.



ఘనంగా రథయాత్ర : దేవస్థానం గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పుష్పాలతో అలంకరించిన రథాన్ని తొలిపావంచా వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా వూపి ప్రారంభించారు. రథంపై వేంజేసిన స్వామిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజు, జిల్లా కలెక్టర్ శ్యామలరావు, టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల, భక్తుల హర్షధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా జరిగింది. రథం ముందు ఏర్పాటు చేసిన తప్పిటగుళ్లు, పులివేషాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పుష్పరథాన్ని 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిప్పింది.



స్వచ్చంద సంస్థల సేవలు : గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి. అడవివరం ప్రాథమిక పాఠశాల వద్ద ప్రముఖ వ్యాపారి బోకం శ్రీనివాస్ భక్తులకు ఫ్రూటీలు అందజేశారు. అలాగే వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. గాంధీనగర్ వద్ద హనుమాన్ ఫ్రెండ్స్ వారు పులిహోర అందజేశారు. అడవివరం కూడలిలో హైదరాబాద్‌కి చెందిన కందాల శ్రీనివాస్ భక్తులకు పూరీలు అందజేశారు. పైనాపిల్‌కాలనీ వద్ద రాఘవేంద్ర అండ్ కో ఆధ్వర్యంలో భక్తులకు ఉప్మా, మంచినీరు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సహకార సంస్థ ఎండి రవిప్రకాష్ ప్రారంభించారు.



 దేవస్థానం ఏర్పాట్లు : గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం దారి పొడవునా 27 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో భక్తులకి మంచినీరు, విశ్రాంతి, వైద్య సదుపాయం అందజేశారు. దారిపొడవునా పలు ప్రాంతాల్లో మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీష్ కమిషనర్ అమిత్‌గార్గ్, డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు విధులు నిర్వర్తించారు. అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్‌లలో వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్ పోలీసులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top