తాడేపల్లికి చేరిన ‘బెజవాడ బ్లేడ్ బ్యాచ్’

తాడేపల్లికి చేరిన ‘బెజవాడ బ్లేడ్ బ్యాచ్’


రైలు వంతెనలను అడ్డాగా చేసుకున్న వైనం

ప్రేమజంటలు, పాదచారులే లక్ష్యం

 తాడేపల్లి రూరల్: బెజవాడ బ్లేడ్ బ్యాచ్ తమ మకాం ను తాడేపల్లికి మార్చింది. ఒంటరిగా కనిపించిన వారిపై దాడిచేసి నిలువుదోపిడీ చేయడం, ప్రతిఘటిస్తే బ్లేడ్‌లతో శరీరంపై కోతలు పెట్టడం ఈ బ్యాచ్ పని. ఈ బ్యాచ్ ఆగడాలను భరించలేని విజయవాడ పోలీసు కమిషనర్ హార్ట్‌కోర్‌గా గుర్తించిన కొందరికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అలా బహిష్కరణకు గురైనవారు నగరంలో కనిపిస్తేచాలు, నేరం చేసినా, చేయకపోయినా కటకటాలు లెక్కించాల్సిందే. ఇలా నగర బహిష్కరణకు గురైన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు సమీపంలోని తాడేపల్లి మహానాడులో ఉంటూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది రైల్వే వంతెనలను అడ్డాగా చేసుకున్నారు.



రైలు వంతెనలపై వెళ్లే పాదచారులు, కృష్ణా నదికి ఇసుక తిన్నెలు, రైలు వంతెనలపైకి విహారానికి వచ్చే ప్రేమికులను టార్గెట్ చేసి బ్లేడ్ బ్యాచ్ తమ కార్యకలాపాలను యథేచ్చగా సాగిస్తోంది. వారి కర్కశత్వానికి ఆదివారం ఓ యాచకుడు కరాట సురేష్ గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానంచేసి రైలు వంతెన కింద నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వస్తుండగా బ్లేడ్‌బ్యాచ్ కంటపడ్డాడు.



ఆ బ్లేడ్‌బ్యాచ్ తనను తీవ్రంగా కొట్టి, బ్లేడుతో బెదిరించి, తన వద్ద ఉన్న సొమ్మును లాక్కొని చేతులు విరగదీసినంత పనిచేసిందని బాధితుడు సురేష్ వాపోయాడు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చుగా అని స్థానికులు సూచించగా, ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమో అని భయం వ్యక్తంచేయడం బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలను తెలియజేస్తోంది. తాను మెదక్ జిల్లా నుంచి వచ్చానని, ఎలా ఫిర్యాదు చేయగలనని బాధితుడు వాపోవడం గమనార్హం!

 

కొద్ది రోజుల క్రితం కృష్ణానది వంతెనలపై బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ నగర బహిష్కరణకు గురైన రవి అనే బ్లేడ్‌బ్యాచ్ లీడర్ మహానాడుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. రవి కోసం అయన స్నేహితులు రోజూ 25 మంది నుంచి 30 మంది దాకా మహానాడుకు వచ్చి పోతుంటారు. ఇందుకు దగ్గరి దారిగా ఉన్న కృష్ణా నది రైలు వంతెనలను రాకపోకలకు వాడుతూ, తమలాగే ఈ వంతెనలపై నుంచి అనేకమంది రావడం పోవడం గమనించి వారిని దోచుకోవడం ప్రారంభించారు. ఈ రైలు వంతెనల పరిధి రైల్వే పోలీసులది కావడం, రైల్వే పోలీసుల పహారా తక్కువగా ఉండడం బ్లేడ్ బ్యాచ్‌కు కలిసి వచ్చింది.



అది తమ పరిధిలోది కాకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఈ వంతెనలపై దృష్టి సారించరు. జనసంచారం అంతగా లేకపోవడం, బ్రిడ్జికి అటుఇటు రైల్వే పోలీసులు గస్తీకి వస్తే పారిపోయేందుకు ముందస్తు హెచ్చరికలు చేసేవీలుంది. ఏకాంతం కోరుకునే జంటలు రైల్వే వంతెనలపైకి ఊసులాడుకుంనేందుకు వచ్చి ఈ ముఠా బారిన పడి అవమానాల పాలైన ఘటనలు లేకపోలేదు.



గత నెల చివరిలో విజయవాడకు చెందిన ఓ యువజంటను బెదిరించి నగలు, నగదు అపహరించడమే కాకుండా యువకుడిపై వికృత చేష్టలకు దిగడం గమనార్హం! వినోద్ అనే రైల్వే వెండర్‌పై పలుమార్లు దాడులు చేయడం, ఆయన, అతని స్నేహితులు ఈ ముఠాతో ఘర్షణకు దిగడంతో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితం ఇదే ముఠాకు చెందిన ఓ యువకుడిని స్థానికులు ప్రతిఘటించి పట్టుకోబోయారు. ఆ యువకుడు తన వద్దవున్న బ్లేడుతో చేతులపై కోసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. బ్లేడ్‌బ్యాచ్‌ల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top