రాజకీయాలకు అతీతంగా ఏజెన్సీ అభివృద్ధి


  • సన్మాన సభలో ఎమ్మెల్యేలు ఈశ్వరి, సర్వేశ్వరరావు

  • పాడేరు రూరల్: విశాఖ మన్యాన్ని పార్టీలకతీతంగా అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు అన్నారు. ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు పాడేరు వర్తక సంఘం ప్రతినిధులు ఆదివారం రాత్రి స్థానిక మోదకొండమ్మ కల్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు.



    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీరు, రోడ్డు, రవాణా, విద్యుత్ సదుపాయల కల్పన కోసం ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఇద్దరం కలిసి సమన్వయంతో మన్యం అభివృద్ధికి పాటుపడతామన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకొని తరతరాలుగా జీవిస్తున్న గిరిజనేతరుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. పాడేరు, అరకు ప్రధాన కేంద్రాల్లో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.



    తన మొదటి వేతనాన్ని పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, పాడేరు, అరకు, డుంబ్రిగూడ జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, కూన వనజ, మండ్యగురు చంద్రమ్మ, పాడేరు, అరకు మేజర్ పంచాయతీల సర్పంచ్‌లు కిల్లు వెంకటరత్నం, సమర్ఢి గులాబి, వర్తక సంఘం నాయకులు రొబ్బి రాము, ఇమ్మిడిశెట్టి అనీల్, అకాశపు సోమరాజు, రొబ్బి శంకర్‌రావు, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, వైఎస్సార్‌సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, శివ,  పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వర్తక సంఘం ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top