‘బెల్టు’ తీసిన ‘ఎక్సైజ్’

‘బెల్టు’ తీసిన ‘ఎక్సైజ్’

  •   జిల్లాలో 331 కేసులు

  •   ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే అధికం

  •   రాష్ట్రంలో రెండోస్థానంలో జిల్లా

  • సాక్షి, విజయవాడ : ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలో బెల్ట్‌షాపులపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. వీటి కట్టడికి ఎక్సైజ్‌శాఖ డెప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఏకంగా ఆరు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. వరుస తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా అంతటా నియమించిన కమిటీల ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఎక్కువ కేసులు నమోదు చేసి, రాష్ర్టంలోనే జిల్లాను రెండో స్థానంలో నిలిపారు.

     

    జోరుగా దాడులు...

     

    జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నెలకు సగటున 80 నుంచి 100 వరకు బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 331 కేసులు నమోదు చేసిన అధికారులు,  316 మందిని అరెస్ట్ చేశారు. 1085 లీటర్ల మద్యాన్ని, 153బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో  గ్రామాల్లో కమిటీలను నియమించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా కమిటీల్లో అధికారులతోపాటు సామాజిక సేవా కార్యకర్తలను భాగస్వాములను చేశారు. ఇది ఇలా ఉంటే.. కొన్ని గ్రామాల్లో పెద్దమనుషులు ‘బెల్ట్’ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు రెండువేలకు పైగా బెల్ట్‌షాపులు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం అధికారపార్టీ కార్యకర్తల కనుసన్నల్లో నడుస్తున్నాయి. వీటిని నియంత్రించడం ఎక్సైజ్ అధికారులకు కొంత సమస్యాత్మకంగా మారింది.

     

    ‘బెల్టు’లు ఇక్కడా ఉన్నాయి..



    జిల్లాలో దాదాపుగా బెల్ట్‌షాపులు లేవని ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినా, అవనిగడ్డ, మచిలీపట్నం, పామర్రు, నూజివీడు, గన్నవరం, నందిగామ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టు షాపులు నడుస్తున్నాయి.  వీటిలో సాధారణ ధర కంటే రూ.10 నుంచి 20 వరకూ అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. అంబాపు రంలో అయితే ఓ ఫ్యాన్సీ షాపులో ఏకంగా బెల్టు షాపు తెరిచి విక్రయాలు చేస్తున్నారు.

     

    మంత్రి నియోజకవర్గంలో..



    జిల్లాలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీప ట్నంలోనే ఎక్కువ బెల్ట్‌షాపులు ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఎక్సైజ్ అధికారులు మాత్రం అసలు బెల్ట్‌షాపు లకు ఆస్కారమే లేదని చెబుతూనే కేసులు నమోదు చేస్తుండటం విడ్డూ రంగా ఉంది. గడిచిన మూడు నెలల్లో మచిలీపట్నంలో జిల్లాలోనే అత్యధికంగా 23 కేసులు నమోదు చేసి 23మందిని అరెస్ట్ చేశారు. అలాగే జిల్లాలోని గుడివాడలో 21 కేసులు, నందిగామ నియోజకవర్గంలో 12, నూజివీడు నియోజకవర్గంలో 9 కేసులు నమోదయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 6 నుంచి 10 వరకు కేసులు నమోదయ్యాయి.

     

     సమాచారం ఇస్తే దాడులు

     జిల్లాలో ఎక్కడైనా బెల్ట్‌షాపులు ఉన్నట్లు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. ఎక్కువ కేసులు నమోదు చేసిన జిల్లాల్లో విజయవాడ రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉంది.

     -జి.జోసఫ్, డెప్యూటీ కమిషనర్

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top