బీఈడీ అభ్యర్థులకు షాక్

బీఈడీ అభ్యర్థులకు షాక్ - Sakshi


రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఉంటే 200 లోపే పోస్ట్‌లు కేటాయించింది. తక్కువ సంఖ్యలో ఉండే డీఈడీ అభ్యర్థులకు ఎక్కువ పోస్ట్‌లు కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది.

 

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు ఊహించని రీతిలో గట్టి షాక్ ఇచ్చింది. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఉంటే 200 లోపే పోస్ట్‌లు కేటాయించింది. ఇదే క్రమంలో తక్కువ సంఖ్యలో ఉండే డీఈడీ అభ్యర్థులకు ఎక్కువ పోస్ట్‌లు కేటాయించి గందరగోళానికి తెరతీసింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేల రూపాయలు వెచ్చించి బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పరిమిత సంఖ్యలో పోస్ట్‌లు కేటాయించటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ పోస్ట్‌లు భర్తీ చేస్తామని పదేపదే ఎన్నికల ముందు ప్రకటించిన టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో బీఈడీ అభ్యర్థులు సుమారుగా 15 వేల మందిపైగా ఉండగా కేవలం 320 పోస్ట్‌లతో సరిపెట్టింది.



టెట్ కమ్ టీఆర్‌టీగా పేరు మార్పు...



రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డీఎస్సీ పేరు మార్చి టెట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌గా విధి విధానాలను ప్రకటించింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని ఎస్‌జీటీలకు డీఈడీ అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో 2 లక్షల 30 వేల మంది బీఈడీ అభ్యర్థులు ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు కేవలం 1,800 ప్రకటించింది. తక్కువ సంఖ్యలో 30 వేల మంది ఉన్న డీఈడీ అభ్యర్థులకు మాత్రం ఏడు వేల పోస్ట్‌లు కేటాయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల బృందం నోటిఫికేషన్ విడుదల క్రమంలో రెండు రోజుల కిత్రం మంత్రి గంటా శ్రీనివాస్‌ను కలిసి 10 వేల 600 పోస్ట్‌లు కేటాయించాలని విజ్ఞప్తి కూడా చేసింది. గతంలో ఏపీ టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు సైతం మళ్లీ పరీక్ష రాయాలని నిబంధన విధించింది. మే తొమ్మిదిన ఎస్‌జీటీ, 10న ఎల్‌పీ, పీఈటీ, 11న స్కూల్ అసిస్టెంట్ లకు ఉమ్మడిగా అర్హత పరీక్షలు నిర్వహించనుంది. దీర్ఘకాలంగా ఎదురుచూసిన అభ్యర్థుల్లో నోటిఫికేషన్ వెలువడుతోందన్న ఆనందం కంటే నిరాశే ఎక్కువైంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీకి అర్హత కల్పిస్తామని నానుస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడం వారి పాలిట శాపంగా మారింది. మరోపక్క అభ్యర్థుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. గతంలో 2012లో డీఎస్సీని నిర్వహించారు.



రెండేళ్ల తర్వాత ఒక ఏడాది వయో పరిమితిని పెంచారు. అర్హత సాధించిన అభ్యర్థులు కొంతమంది వయోపరిమితి కారణంగా ఉద్యోగం కోల్పోతున్నారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించి మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి మరికొంతమందికి నెలకొంది. ఉమ్మడి పరీక్షల్లో వచ్చిన మార్కులు, గతంలో జరిగిన టెట్ మార్కు ల్లో ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అందుకు అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తామని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులు కొత్తగా కుస్తీ పట్టాల్సి వస్తోంది. బీఈడీ అభ్యర్థుల సిలబస్ విస్తృతంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 320 పోస్ట్‌లను ప్రకటించారు. వీటిలో 213 ఎస్‌జీటీ పోస్ట్‌లు కాగా, 107 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ సైన్స్ కేవలం రెండు పోస్ట్‌లే ఉన్నాయి. ఇంగ్లీష్ 8 పోస్ట్‌లు, సోషల్ 39 పోస్ట్‌లు, తెలుగు 29 పోస్ట్‌లు ఉన్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top