శిరీషను ఆ ముగ్గురే కొట్టి చంపారు

శిరీషను ఆ ముగ్గురే కొట్టి చంపారు


హంతకులను పోలీసులే కాపాడుతున్నారు

శిరీష మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి

మృతురాలి బాబాయి, పిన్ని డిమాండ్‌




సాక్షి, అమరావతి బ్యూరో: బ్యూటీషియన్‌ శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆమె బాబాయి శ్రీనివాసరావు, పిన్ని దుర్గారాణి డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలోని రాయచూరులో ఉండే శిరీష బాబాయి, పిన్ని శ్రీనివాసరావు, దుర్గారాణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వెళుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద మీడియాతో మాట్లాడారు.



హంతకులను కాపాడేందుకే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శిరీష మీద అపనిందలు మోపుతున్నారని విమర్శించారు. రాజీవ్‌తో శిరీష నాలుగేళ్లుగా సహజీవనం చేసిందని అపనిందలు వేశారని వారు ఆరోపించారు. శిరీష 2016, జూలై వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో సొంతంగా బ్యూటీపార్లర్, ఓ కిరణా దుకాణం నిర్వహించిందన్నారు. గత ఆరు నెలలుగా మాత్రమే ఆమె రాజీవ్‌కు చెందిన ఆర్‌జే ఫొటో స్టుడియోలో పనిచేస్తోందన్నారు.



శిరీష పేదింటి పిల్ల కాబట్టి డబ్బు ప్రభావానికి గురైందని కూడా మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని, తమది మధ్యతరగతి కుటుంబమని వారు స్పష్టం చేశారు. రాజీవ్, శ్రావణ్, ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి కలసి తమ బిడ్డను కొట్టి, హింసించి, హత్యచేశారని, అనంతరం ఎస్‌ఐ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడన్నది వాస్తవమన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే వంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఆమెను ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతోనే హత్య చేశారని ఆరోపించారు.



శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మేనమామ సూర్యారావు పేర్కొన్నారు. రాజీవ్, శ్రావణ్‌ కుటుంబ సభ్యులను కూడా విచారించాలని కోరారు. అదే విధంగా ఈ కేసులో అనుమానస్పద పాత్ర పోషించిన తేజస్వినిని ఎందుకు బయటకు తేవడం లేదని శ్రీనివాసరావు, దుర్గారాణి ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏకపక్షంగా కేసును ముగించాలని శిరీష నడవడిక మీద అపనిందలు వేయడం దారుణమని ఆరోపించారు. శిరీష ఫోన్‌ సంభాషణల పేరుతో ఏవో టేపులు తెచ్చి ఆమె ప్రవర్తనను తప్పుపట్టేలా పోలీసులు ప్రచారం చేయడం దారుణమన్నారు. వాస్తవాలను వెలికితీసేలా విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top