సామాజిక బాధ్యతతో కేసులు చేపట్టాలి

సామాజిక బాధ్యతతో కేసులు చేపట్టాలి


హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాను



 గుంటూరు లీగల్

 సామాజిక బాధ్యతతో ఆలోచించిన తర్వాతే కేసులు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ కె.సి.భాను న్యాయవాదులకు సూచించారు. ‘క్రిమినల్ ట్రయల్, బేసిక్స్ ఆఫ్ క్రిమినల్ లా’ అనే అంశంపై స్థానిక మెడికల్ కళాశాలలోని జింఖా నా ఆడిటోరియంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరం సమాజానికి వ్యతిరేకమైనదనీ, సమాజంలోని వ్యక్తులు శాంతియుతంగా బాధ్యతాయుతంగా మెలగాలని పేర్కొన్నారు.



నేరం సమాజ నిర్మాణాన్ని మార్చేస్తుందని హెచ్చరించారు. నేర రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుని బాధ్యతని అన్నా రు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసులను దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. క్రిమినల్ లాకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పులను ఉటంకిస్తూ ఆయన చేసిన ఉపన్యాసం న్యాయవాదులను ఆకట్టుకుంది. న్యాయవిచారణ ప్రక్రియలో పలు మెలుకువలను వివరించారు.



జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.రఫీ మాట్లాడుతూ జస్టిస్ భాను క్రిమినల్ లాలో అత్యంత నిష్ణాతులని, దేశంలోని చట్టాలపై మంచి పట్టు ఉందని కొనియాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదుల సంక్షేమాన్ని కాంక్షించే న్యాయమూర్తి జస్టిస్ భాను వివిధ సదస్సుల్లో చేస్తున్న ప్రసంగాలు తమ వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు దోహదపడుతున్నాయని అన్నారు.



బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సి.రవీంద్రబాబు జస్టిస్ భాను గురించి పరిచయం చేశారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది నట్టువ సత్యనారాయణ స్వాగతం పలుకగా మహిళా కార్యదర్శి వై.లక్ష్మీశైలజ వందన సమర్పణ చేశారు. చివరిగా జస్టిస్ భాను దంపతులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా సత్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top