బ్యాంకర్ల ‘డ్రా’మా!


డ్వాక్రా మహిళలకు బ్యాంకు అకౌంటు తప్పనిసరి అంటూ ఆదేశాలిచ్చారు.. రుణాలు నేరుగా మీకే అందుతాయని నమ్మబలికారు.. ఇంకేముంది మీ రుణాలన్నీ మాఫీ.. అంటూ ఊదరగొట్టేశారు. తీరా చూస్తే తమ ఖాతాల్లో డబ్బు డ్రా చేసుకోనివ్వకుండా అడ్డమైన కొర్రీలు పెడుతూ పొదుపు మహిళలను బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు. స్వయానా మంత్రి

 ఇలాకాలో బ్యాంకర్ల తీరుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.




 పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు):  మోకాలికి బోడిగుండుకు ముడివేసిన సామెత చందంగా ఉందీ వ్యవహారం! మరుగుదొడ్ల నిర్మాణానికి బిల్లు వచ్చింది తీసుందామని బ్యాంకుకు వెళితే.. కుదరదు మీరు గతంలో తీసుకున్న డ్వాక్రా రుణాలు చెల్లిస్తేనే ఈ బిల్లులు ఇస్తామంటూ మెలిక పెడుతున్నారు.  బ్యాంకర్లు పెడుతున్న కొర్రీలకు మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాలివి.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు ఆదిఆంధ్రాకాలనీకి చెందిన ప్రత్తిపాడు సుగుణమ్మ, ఈశ్వరమ్మ స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు.

 

 ఇందుకు జూలై ఒకటిన తొలివిడతగా ప్రభుత్వం నుంచి రూ.6,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఆ నగదును డ్రా చేసుకొనేందుకు గురువారం ఇద్దరు స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. అయితే గతంలో తీసుకున్న డ్వాక్రా రుణాలు చెల్లిస్తేనే ఈ నగదు డ్రా చేసుకోనిస్తామని, అప్పటివరకు వీల్లేదని బ్యాంకు సిబ్బంది అడ్డు చెప్పారు.

 

 డ్వాక్రా రుణాలు, మరుగుదొడ్డి నిర్మాణ బిల్లులకు సంబంధం ఏంటని మహిళలు బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదని, బయటకు పోవాలని సిబ్బంది అన్నట్లు బాధిత మహిళలు వాపోతున్నారు. ఓ పక్క వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ  లక్ష్యాలు చేరుకొనేందుకు అధికారులు తంటాలు పడుతుంటే.. ప్రభుత్వం చెల్లించిన నగదును లబ్ధిదారులు తీసుకోకుండా బ్యాంకర్లు అడ్డుపడుతుండడం విమర్శలకు తావిస్తోంది.

 

 ఎల్‌ఐసీ నగదుకూ మోకాలడ్డు..

 ఇదే గ్రామానికి చెందిన కొండెపాటి మరియమ్మకు ఇటువంటి సమస్యే ఎదురైంది. భర్త అకాల మరణంతో ఆమెకు రూ.41,475  ఎల్‌ఐసీ డబ్బులు వచ్చాయి. జూన్ 22న నగదు మొత్తం ఆమె ఖాతాకు జమ అయ్యాయి. సొమ్ము డ్రా చేసుకొనేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆమెకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. గతంలో తీసుకున్న డ్వాక్రా రుణ బకాయిలను చెల్లిస్తేనే ఈ నగదును డ్రా చేసు కోనిస్తామంటూ బ్యాంకర్లు తెగేసి చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. వీరంతా గురువారం పంచాయతీ కార్యాలయంలో  సర్పంచ్ గుంటుపల్లి బాబూరావును కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకుకు వెళితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 అలా చేయడానికి వీల్లేదు..

 వ్యక్తిగత మరుగుదొడ్లు నిమిత్తం బ్యాంకు ఖాతాలకు జమచేసిన నగదును లబ్ధిదారులు డ్రా చేసుకోనివ్వకుండా బ్యాంకర్లు అడ్డు తగలడం సరికాదు. అలా చేయడానికి వీల్లేదు. పాత బకాయిలకూ, మరుగుదొడ్లు బిల్లులకు సంబంధం లేదు. బ్యాంకర్లతో  మాట్లాడతాను. మరుగుదొడ్లు బిల్లులు డ్రా చేసుకొనేలా చర్యలు తీసుకుంటాం.

 - టీవీ విజయలక్ష్మి, ఎంపీడీవో

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top