‘బంగారు తల్లి’ ఎక్కడ!


 ఇంతవరకూ లబ్ధిదారులకు బాండ్లు అందని వైనం

 ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేని సమాచారం




 రాయవరం/అంబాజీపేట : పుట్టుక నుంచి పట్టా పుచ్చుకునే వర కూ అండగా ఉంటామం టూ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం దిశానిర్దేశం లేకుండా ఉంది. తెలుపు రేషన్‌కార్డు కలిగిన బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండేం దుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు బాండ్లు అందలేదు.

 

 పథకం ప్రవేశపెట్టిన తీరు

 ఈ పథకాన్ని 2013 మే ఒకటిన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పుట్టిన చిన్నారులను గుర్తించేందుకు సర్వే చేపట్టి, వివరాలను ఆన్‌లైన్ చేశారు. బిడ్డకు తొలిదశలో రూ.2,500 ఇవ్వాలని నిర్దేశించారు. తొలి పుట్టిన రోజు మొదలు.. డిగ్రీ పూర్తి చేసే వరకు దశలవారీగా నగదును వారి ఖాతాలో జమచేస్తారు. డిగ్రీ చేతికి రాగానే ప్రభుత్వం లక్ష రూపాయలను జమ చేస్తుంది. పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. తొలి కాన్పులో అమ్మాయి పుట్టి, రెండో కాన్పులో ఇద్దరు అమ్మాయిలు జన్మించినా పథకాన్ని వర్తింపజేయాలి.

 

 శాఖ మార్పుతో సందిగ్ధం

 ఐకేపీ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతేడాది ్రఏపిల్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకం బాధ్యతలు అప్పగిస్తూ జీఓ జారీ అయింది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తులతో రెండు శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. తమకు సంబంధం లేదని ఐకేపీ అధికారులు అంటుండగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

 అందని బాండ్లు

 జిల్లాలో ఈ పథకానికి సంబంధించి బాండ్లు ఇప్పటివరకు అందలేదు. రాయవరం మండలంలో 2013 మే నుంచి 2015 ఏప్రిల్ వరకు 469 మంది రిజిస్ట్రేషన్ చేయించారు. 24 మంది ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేకపోయారు. దీంతో 445 మందిలో కేవలం 33 మందికి  మాత్రమే బాండ్లు వచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మొత్తం 1,800 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. దీనిపై ఏపీఎం రవిరాజాను  వివరణ కోరగా, రాయవరం మండలంలో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయాల్సి ఉందన్నారు. త్వరలో జమ కాగలవని పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top