‘పచ్చ’కోట్ల పబ్లిక్‌ జాతర

‘పచ్చ’కోట్ల పబ్లిక్‌ జాతర - Sakshi


టెర్రర్‌ గుప్పిట్లో సామాన్యుడి ‘చిల్లర’

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అంతులేని అరాచకాలు

పట్టించుకోని పోలీసులు, అధికారయంత్రాంగం

ఒత్తిళ్లతో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులపై దాడులు

వారినుంచి సొంత అవసరాల సొమ్ములు స్వాధీనం

టీడీపీ వందలకోట్లు వెదచల్లుతున్నా పట్టని పోలీసులు




సాక్షి, అమరావతి/ కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ పబ్లిక్‌గా వందల కోట్ల రూపాయలను వెదజల్లుతోంది. సొంత పార్టీ నేతలకు కోట్ల కొద్దీ డబ్బులు ఇవ్వడంతో పాటు ఇతర పార్టీల నేతలకూ డబ్బు మూటలతో ఎరవేస్తోంది. ఇదంతా బహిరంగంగా కళ్లెదుటే జరుగుతున్నా పోలీసు, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మరోవైపు అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన, వారితో పరిచయమున్న వ్యక్తులో.. ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారిపై మాత్రం దాడులు చేయిస్తున్నారు. సొంత అవసరాలు, వ్యాపారాల కోసం వారు దాచుకున్న చిన్నచిన్న మొత్తాలను స్వాధీనం చేసుకుంటున్నారు.



అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు తెగబడుతున్నా పట్టించుకోని యంత్రాంగం.. చిన్నచిన్న వ్యక్తులు, నాయకులను మాత్రం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, అనుకూలంగా లేని వారిని బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నా అడిగే నాథుడు లేడు. ప్రతిరోజూ ప్రచారం కోసమే రూ.12.75 కోట్లు ఖర్చు చేస్తోందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాలలో ఇప్పటి వరకు టీడీపీ చేసిన ఖర్చు రూ.100 కోట్లు దాటిపోగా, మరో 150 కోట్ల వరకు సిద్ధం చేయిస్తోంది. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లే కార్యక్రమాలకు దిగుతోంది.



తాము వేసిన రోడ్లపై నడుస్తూ, పెన్షన్లు, రేషన్‌ తీసుకుంటూ తమకు ఓటు వేయరా? అంటూ నోటిఫికేషన్‌కు ముందే సీఎం హోదాలో చంద్రబాబు ప్రజలను బెదిరించగా.. ఆ పరంపరను ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు నంద్యాలలో రోజూ కొనసాగిస్తున్నారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తలపై కూడా చేయి చేసుకుంటున్నారు. ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతూ మరోపక్క ప్రతిపక్ష పార్టీపై నెపాన్ని నెట్టేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో అరాచకాలకు పాల్పడతారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై తన మీడియా ద్వారా బయటకు లీకులు ఇప్పించారు. అడ్డగోలుగా కోట్ల నిధులు పందేరం చేస్తూ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతూ మరోవైపు ప్రత్యర్థులపై నిందలు వేసేలా చంద్రబాబు తెరవెనుక వ్యూహాలకు తెరతీశారు.



కీలక నేతలకు రూ.పది కోట్లకు పైగా ఆఫర్లు

నంద్యాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సహా తెలుగుదేశం నాయకులు నంద్యాలలో పర్యటించి అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు.. ఆప్పటి నుంచే తన నిజరూపాన్ని బయట పెట్టారు. ఓటమి సీన్‌ స్పష్టం కావడంతో తీవ్ర అసహనంతో తాను వేసిన రోడ్లపై నడుస్తూ, రేషన్, పింఛన్‌ తీసుకుంటూ తనకు ఓట్లు ఎలా వేయరంటూ ప్రజలను ప్రశ్నించారు. ఒక దశలో నంద్యాల ప్రజలను బెదిరించేలా మాట్లాడారు. అయినా ప్రజల నుంచి వ్యతిరేకత మరింత పెరగడంతో ఇప్పుడు ఏకంగా వందల కోట్ల మేర డబ్బు సంచులను దించారు.



నియోజకవర్గంలో ఆయా పార్టీల్లోని నేతలను గుర్తించి వారి బలా బలాలు, స్థాయిని అనుసరించి డబ్బు ముట్టజెప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి నేతలకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఇస్తూ తమకు అనుకూలంగా పని చేయాలని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక గ్రామ, వార్డు స్థాయి నేతలకూ భారీగానే ముట్టజెపుతున్నారు. 50, 100 ఓట్లున్నాయనుకుంటే చాలు ఆ నేత వద్దకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఇస్తూ లొంగదీసుకుంటున్నారు.



ప్రచారానికి భారీ ఖర్చు

ఎన్నికల్లో తమ ప్రచారం కోసం తెలుగుదేశం నేతలు భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ పరిధిలో రూ.5 లక్షల చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రచారం కోసమే అచ్చంగా రోజుకు రూ.12.75 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుగేదేశం నేతలే చెబుతున్నారు. తమ ప్రచారంలో పొల్గొనే పార్టీ శ్రేణులతో పాటు.. వెంట భారీగా అనుసరించడానికి ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో జనాలను తరలిస్తున్నారు. ఇలా రోజువారీ చెల్లింపులే ఒక్కో వార్డులోనే లక్షల్లో ఉంటోంది. అయినా ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం, అదే సమయంలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా ఆ పార్టీ ఇతర నేతల ప్రచారాలకు ప్రజల నుంచి విపరీత స్పందన వస్తుండడంతో టీడీపీ నేతలు కొత్త ఎత్తుగడలు పన్నుతున్నారు. ప్రతిపక్ష నేతల ప్రచార సభలకు ఓటర్లు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఎదురు డబ్బులు ఇస్తున్నారు. ముఖ్యంగా వైఎస్‌ జగన్‌ ప్రచారం జరిగే ప్రాంతాల్లో వీరి కుట్రలకు అంతులేకుండా పోయింది.



మీడియా మేనేజ్‌మెంటుతో మైండ్‌గేమ్‌

నంద్యాల ఓటర్లలో తమ పట్ల ఎలాంటి సానుకూలత లేకపోవడంతో మీడియా మేనేజ్‌మెంట్‌ ద్వారా చంద్రబాబు నాయుడు మైండ్‌గేమ్‌కు తెరతీశారు. తమ అనుకూల పత్రికలు, చానెళ్లలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఉందనో, ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు భారీగా చేరిపోతున్నారనో రోజుకోరకమైన కథనాలు వండివార్పిస్తూ ప్రజల మనసు మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కోట్ల రూపాయల ప్యాకేజీలు ముట్ట జెబుతున్నారు.



తమ పార్టీ శ్రేణుల ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించకపోవడంతో ఇతర జిల్లాలకు చెందిన కొందరు విద్యార్థులు, నారాయణ కాలేజీలకు సంబంధించిన సిబ్బందిని నంద్యాలకు రప్పించారు. వారితో కొంతకాలంగా ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయిస్తున్నారు. వీరు ఇంటింటికీ తిరుగుతూ రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇతర వివరాలు తెలుసుకుంటూ టీడీపీకి ఓటు వేయాలని, లేకపోతే ఈ పథకాలన్నీ వచ్చే కాలంలో నిలిపివేస్తామని బెదింపులకు దిగుతున్నారు. పైగా ఆయా ఇళ్ల యజమానుల బ్యాంకు ఖాతా నెంబర్లను కూడా తీసుకుంటుండడం విశేషం. ఎన్నికల్లో నేరుగా వారి అకౌంట్లలో డబ్బు జమ చేయించేందుకు వీలుగానే టీడీపీ ఇలాంటి అరాచకాలకు దిగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



డబ్బులిస్తాం ఓటింగ్‌కు రావద్దు

ఈ ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రానున్న సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపేలా రాష్ట్రంలోని పరిస్థితులను మార్పు చేస్తుందని భావిస్తున్న చంద్రబాబు ఈ ఎన్నికపై ఎలాగైనా పరువు దక్కించుకోవాలని అనేక పన్నాగాలకు తెరతీస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేసేందుకు వీలుగా ప్రతి ఓటుకు దాదాపు రూ.5 వేల చొప్పున డబ్బులు పంపిణీ చేయిస్తుండడమే కాకుండా తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోని ఓటర్లపై కూడా వల వేస్తున్నారు.



ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న చోట్ల ఓటర్లు ఓటింగ్‌కు రాకుండా కట్టడి చేసేలా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ‘మీరు మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు మీరు ఓట్లు వేయడానికి రాకుండా ఉంటే చాలు’ అంటూ వారికి డబ్బులు ఎర చూపుతున్నారు. నంద్యాల పరిధిలోని చర్చిలు, మసీదులు, ఆలయాల గురించి ఇన్నాళ్లూ కనీసం పట్టించుకోని తెలుగుదేశం నేతలు ఇప్పుడు వాటిపై వాలుతున్నారు. మసీదులు, చర్చిలకు రూ.20 నుంచి 30 లక్షల వరకు పంపిణీ చేయించడానికి డబ్బులు సిద్ధం చేశారు. ఆయా మసీదులు, చర్చిల ద్వారా ఆయా వర్గాల ప్రజలను లోబర్చుకొనేందుకు ఈ డబ్బు వెదజల్లుతున్నారు.



విజయవాడ నుంచి డబ్బు పంపిణీ

ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు ఓట్లు వేయించగలిగిన సామర్థ్యమున్న స్థానిక నేతలకు భారీ మొత్తాలను ఆశ చూపుతున్నారు. అటువంటి వారిని గుర్తించి నేరుగా విజయవాడకు పిలిపించి మరీ డబ్బును పంపిణీ చేస్తున్నారు. ముఖ్యనేత కార్యాలయం కేంద్రంగా ఈ పంపిణీ సాగుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఒక వర్గం ఓట్లు 100 ఉన్నాయని తెలిసి.. వారికి ఏకంగా రూ.20 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. నంద్యాల మండలంలోని ఒక గ్రామానికి చెందిన నేతకు పారిశ్రామిక పాలసీ కింద బినామీ ఎస్సీ పేరుతో 40 శాతం సబ్సిడీతో జేసీబీ మంజూరు చేయాలని సంబంధిత మంత్రి.. అధికారులకు ఫోన్‌ చేసినట్టు సమాచారం.



గోస్పాడు మండలంలోని ఒక గ్రామంలో రోడ్డు వేయించాలని నేరుగా జిల్లా ఉన్నతాధికారికే మరో ఎమ్మెల్యే ఫోన్‌ చేశారు. ఈ విధంగా అధికార పార్టీ అన్ని అడ్డదారులనూ తొక్కుతోంది. ఇప్పటి వరకు మొత్తం నగదు పంపిణీ వ్యవహారాన్ని నంద్యాల్లోని ఒక హోటల్‌ కేంద్రంగా నడిపిస్తున్న అధికార పార్టీ తమ స్థావరాన్ని మంగళవారం నుంచి మార్చినట్టు తెలుస్తోంది. ఒక కాలేజీలో రూ.8 కోట్ల మొత్తాన్ని దాచి ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నేత కార్యాలయంలో రూ.2 కోట్ల నగదు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వచ్చిన రూ.100 కోట్ల మొత్తాన్ని పట్టణంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వెచ్చిస్తున్నారు.  



ఏరులై పారుతున్న మద్యం

ఒకవైపు భారీగా నగదు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ.. మరోవైపు మద్యం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోట్ల విలువైన మద్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కొండాపురం కాలనీలోని ఒక ప్రాంతంలో భారీగా క్యూలైన్‌లో నిలబెట్టి మరీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామాలకు కూడా మద్యం కేసులు తరలిస్తున్నారు. ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన మద్యం సీసాలు వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు దాడులకు తెగబడుతున్నారు. అల్లరి మూకలకు బాగా మద్యాన్ని తాపి పంపి.. రెచ్చగొట్టి అల్లర్లు చెలరేగేలా అధికార పార్టీ ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కాగా, అధికార పార్టీ నేతలు గ్రామాల్లో ఇప్పటికే ఓటుకు రూ.2 వేల ప్రకారం పంపిణీ చేశారు. ఇది మొదటి విడత మాత్రమేనని, మరో రెండు విడతల్లో మరికొంత మొత్తం ఇస్తామని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top