మాట తప్పిన బాబుపై మండిపాటు

మాట తప్పిన బాబుపై మండిపాటు - Sakshi

  • రుణమాఫీ పరిమితులపై తీవ్ర నిరసన

  •  వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన

  •  భారీగా రాస్తారోకోలు, మానవహారాలు

  • సాక్షి, విశాఖపట్నం: రుణ మాఫీ హామీ అమలుపై పరిమితులు విధిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో నరకాసుర వధ పేరిట మూడు రోజుల ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.



    జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా రాస్తారోకో, మానవహారం, చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలతో హోరెత్తించాయి. పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలునాయుడు, గిడ్డి ఈశ్వరి తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు బూటకపు హామీలపై ధ్వజమెత్తారు.



    ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన తేదీ ఖరారైందని, రెండు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులేంటో పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్రస్తుతం మాట మార్చడం సరికాదని వారు ఆక్షేపించారు. అన్నీ తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మొత్తం రూ.1,01,816 కోట్ల రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చి ప్రస్తుతం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

         

    మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో కాశీపురం కూడలిలో రాస్తారోకో, మానవహారం, చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం జరిగాయి.

         

    పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాస్తారోకో, మానవహారం నిర్వహించి చంద్రబాబు దిష్టి బొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు.

         

     యలమంచిలిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో ఆందోళన చేపట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

         

     అరకులోయ నియోజకవర్గం హుకుంపేటలో పార్టీ మండల శ్రేణులు రాస్తారోకో నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి.

         

     నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని మాకవరపాలెంలో పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.

     

     పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేసి, ఆందోళన నిర్వహించారు.

         

     పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఆయన సోదరుడు రవికుమార్ ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టారు. రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.

         

     భీమిలిలో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం నేతృత్వంలో భీమిలి అర్బన్ ఇన్‌చార్జి అక్కరమాని వెంకటరావు, పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.

         

     విశాఖ తూర్పు నియోజకవర్గంలోని చినవాల్తేరు కూడలిలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top