ఆయనొద్దు..!

ఆయనొద్దు..!


సాక్షి ప్రతినిధి, కడప:

 ‘ఈ కలెక్టర్ మామాట వినట్లేదు.. మేము ఒకటి చెబితే ఆయన ఇంకొటి చేస్తున్నారు. పదేళ్లుగా అధికారం లేదు.. ఇప్పుడన్నా నచ్చినోళ్లను కావాల్సిన సీట్లల్లోకి తెచ్చుకుందామంటే అడ్డుకొర్రీలు వేస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడన్నా మాది పైచేయి కావాలి..కదా! కడప ఆర్డీఓగా మేము అనుకున్న వాళ్లను కాదని, ఆయనో పేరును సిఫార్సు చేశారు.. తహశీల్దార్ల నియామకాల్లో కూడా సిఫార్సులకు అనుగుణంగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.. ఈయనే ఉంటే మాకు ఇబ్బందే,. బదిలీ చేయించండి.’.. జిల్లాలో ప్రస్తుతం తెలుగుతమ్ముళ్ల మధ్య నడుస్తున్న సంభాషణ ఇది.




 జిల్లా కలెక్టర్‌గా కేవీ రమణ ఈ ఏడాది జూలై 14న బాధ్యతలు చేపట్టారు. అనతికాలంలోనే అత్యంత సున్నితంగా ఫైళ్ల పరిశీలన చేస్తూ తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దశాబ్ధాల తరబడి పెండింగ్‌లో ఉన్న మైనింగ్ బకాయిల సత్వర వసూళ్లకు చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకునే దిశగా క్షుణ్ణంగా చర్చిస్తూ, సమగ్రంగా పరిశీలన చేస్తున్నారు. మొదట్లో అధికారులలో కొంత వ్యతిరేకత వ్యక్తమయినా ప్రస్తుతం సానుకూలంగా స్పందిస్తున్నారు.  అయితే కలెక్టర్ తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడటం లేదు.




 కడప ఆర్డీఓ నియామకంలో పీటముడి....

 జిల్లాలో ఆర్డీఓ నియామకాల్లో అధికార పార్టీ నేతలు వారికి అనువైన అధికారులను నియమించుకునేందుకు పావులు కదిపారు. ఆమేరకు అక్కడి నాయకుల సిఫార్సులకు అనుగుణంగా జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీఓల నియామకాలు చోటు చేసుకున్నాయి. కడప ఆర్డీఓ నియామకంపై పీటముడి పడింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న లవన్నను కొనసాగించాలని టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానాన్ని వరప్రసాద్ అనే అధికారితో భర్తీ చేయాలని కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తానరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.  వరప్రసాద్ జిల్లావాసి  కావడంతో నియామకం పెండింగ్‌లో పడినట్లు సమాచారం. ఈపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణారావు జిల్లా కలెక్టర్ అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. వారిద్దరికంటే రాజంపేటలో పనిచేసి బదిలీపై వెళ్లిన విజయసునీత సముచితంగా ఉంటుందని  జిల్లా కలెక్టర్  నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది.  దీంతో జిల్లా కలెక్టర్‌పై తెలుగుతమ్ముళ్లు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఒకటి తలిస్తే కలెక్టర్ ఇంకొకటి  చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కోటరీలో ఉన్న ఓ నాయకుని వద్ద  మొరపెట్టుకున్నట్లు సమాచారం.  తహశీల్దార్ల నియామకాల్లో కూడా తాము సూచించిన వారిని కాదని కలెక్టర్ కొందరిని   మార్చారని  ఆ నేత ఎదుట వాపోయినట్లు  తెలుస్తోంది.  ఇప్పుడిప్పుడే జిల్లా పరిస్థితుల పట్ల కలెక్టర్  సమగ్ర అవగాహన పెంచుకుంటూ  పోతున్న తరుణంలో  బదిలీ   చేయాల్సిందేనని తెలుగుతమ్ముళ్లు పట్టుపడుతున్నట్లు  తెలుస్తోంది.




 బిజీగా బిజీగా ఉంటూనే...

 ఒకటి రెండు వివాదాస్పద అంశాలను మినహాయిస్తే తన పని తాను చేసుకుంటూ  జిల్లా కలెక్టర్‌గా కేవీ  రమణ బిజీబిజీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.    ఇలాంటి తరుణంలో బదిలీ చేయాలనే దిశగా తెలుగుతమ్ముళ్లు పావులు కదపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పట్టుమని మూడు నెలలు కూడా గడవకమునుపే కలెక్టర్‌పై వ్యతిరేకత ప్రదర్శించడం ఏమాత్రం సరైంది కాదని పలువురు భావిస్తున్నారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top