నిధులు పారేనా.. ‘పంట’ పండేనా!


కర్నూలు(రూరల్): రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌పై జిల్లా ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జిల్లాకు చెందిన పత్తికొండ శాసనసభ్యుడు కె.ఈ.కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో న్యాయం చేకూరుతుందనే నమ్మకం రెట్టింపవుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.



జిల్లాలో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టుల పనులకు నీటిపారుదల శాఖ అధికారులు రూ.399.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా వర్షాభావ పరిస్థితులతో రైతుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో హగరి, తుంగభద్ర, కృష్ణా, హంద్రీ, కుందూ నదులు ప్రవహిస్తున్నా బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు నిర్మితమవుతున్న ప్రాజెక్టుల్లో పురోగతి లోపించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మితమైంది.



 గత ఏడాది కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అయితే కాల్వ లైనింగ్, పెండింగ్ పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల మరమ్మతులకు 2014-15 బడ్జెట్‌లో రూ.900 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత హామీలకు కొత్త రంగు పూసి హడావుడి చేసినా తొలి బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీకి ఎగువన గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే పూర్తి కావచ్చింది.



 ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని బాబు హామీ ఇచ్చినా బడ్జెట్‌కు అధికారులు ప్రతిపాదించని పరిస్థితి. ప్రభుత్వం కోరనందున తాము ముందడుగు వేయలేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇక పశ్చిమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు హగరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ప్రకటించినా నిధుల ఊసెత్తకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు పంపిన ప్రతిపాదనల్లోనూ ఎన్నింటికి నిధులు కేటాయిస్తారో.. వేటికి కోత విధిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.



 మరికొన్ని ప్రతిపాదనలు ఇలా...

  శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు, సిబ్బంది ఇతరత్రా ఖర్చులకు మొత్తం 48.30 కోట్లు.



  ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్ 1, 2 పరిధిలో ప్యాకేజీ 24 నుంచి 30 వరకున్న గాలేరు నగరి సుజల స్రవంతి పథకం పెండింగ్ పనులకు 41.70 కోట్లు.



  ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్-1 పెండింగ్ పనులు, అటవీ భూముల సేకరణకు రూ.87 కోట్లు.



  ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్-2 పరిధిలోని పనులకు రూ.123 కోట్లు.



  కర్నూలు-కడప కాలువ లైనింగ్, మరమ్మతులు, డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.18.87 కోట్లు.



  తెలుగుగంగ కాలువ లైనింగ్, వెలుగోడు రిజర్వాయర్ పెండింగ్ పనులు, బ్లాక్‌ల డిస్ట్రిబ్యూటరీ పనులుకు రూ.31 కోట్లు.



  తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పెండింగ్ పనులకు రూ.11.16 కోట్లు.



  కర్నూలులో వరద రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా అత్యవసర పనులకు రూ.35 కోట్లు.



  గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు.. కుడి, ఎడమ కాల్వల పెండింగ్ పనులు, బండ్ బలోపేతానికి రూ.1.12 కోట్లు

  వరదరాజుల స్వామి ప్రాజెక్టు పనులకు రూ.2.50 కోట్లు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top