పోలీసులపై దాడికి యత్నం

పోలీసులపై దాడికి యత్నం - Sakshi


- ఇసుక ట్రాక్టర్ ఆపకుండా వెళుతుండగా..

- వెంటాడి పట్టుకున్న వన్‌టౌన్ పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం:
ఇసుక మాఫి యా ఆగడాలు రోజు రోజుకూ పేట్రేగి పోతున్నాయి. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆపమని కోరిన పోలీసులపై సంబంధిత వ్యక్తులు దాడికి యత్నించారు. దీంతో వన్‌టౌన్ పోలీ సులు రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల మేరకు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం ఉండటంతో ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం గురువారం బయలుదేరారు.



బైపాస్‌రోడ్డులో ఇసుక ట్రాక్టర్ కనిపించడంతో పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులతో కలిసి వచ్చిన పోలీసులు ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. కొద్ది సేపటి తర్వాత వన్‌టౌన్ పోలీసులు దివాకర్, రాజు, సుబ్బయ్యలు బైపాస్‌రోడ్డులో వస్తున్న సమయంలో పెన్నా నదిలో నుంచి ఇసుక ట్రాక్టర్ వచ్చింది.



ఆపమని పోలీసులు చెయ్యి ఎత్తగా వారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు మోటర్ బైక్‌లతో ట్రాక్టర్‌ను వెంటాడారు. చౌటపల్లె సమీపంలోకి వెళ్లగానే డ్రైవర్ రాజశేఖర్ ట్రాక్టర్‌ను ఆపి కంప చెట్లలోకి పారిపోయాడు. పోలీసులు ట్రాక్టర్ వద్దకు వెళ్లగానే  ట్రాక్టర్ యజమానితో పాటు గ్రామంలోని పలువురు వ్యక్తులు పోలీసులను చుట్టుముట్టారు. ట్రాక్టర్‌ను తీసుకొని వెళ్లడం కాదు.. ముందు మీరు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారో చూద్దాం అంటూ కేకలు వేశారు.



మేమే బ్లేడుతో కోసుకొని మీపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటూ బెదిరించారు.  ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అక్కడున్న ట్రాక్టర్‌ను తీసుకొని వెళ్లాడు. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు వన్‌టౌన్  సీఐ మహేశ్వరరెడ్డికి తెలిపారు. తర్వాత డీఎస్పీ సూచనతో ముగ్గురు కానిస్టేబుళ్లు దివాకర్, సుబ్బయ్య, రాజులు రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజశేఖర్, బాబు, దేవదాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జీఎండీబాషా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top