వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం - Sakshi


తొండంగి : తొండంగి మండల వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంటరమణపై టీడీపీ వర్గీయులు ఆదివారం హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఎల్లయ్యపేటకు సమీపంలో రమణ పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా జి.ముసలయ్యపేట, కె.ముసలయ్యపేట గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు తాటిపర్తి దండు, నేమాల సత్తిబాబు, తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని ఈ దాడికి పాల్పడ్డారు. ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశారు. ప్రాణభయంతో రమణ పెద్దగా కేకలు వేస్తూ ప్రయత్నం చేసినా వారు నోరు నొక్కి మరీ దాడికి తెగబడ్డారు.

 

 అక్కడే సమీప పొలంలో పనులు చేసుకుంటున్న తాటిపర్తి కాండ్రకోట, తాటిపర్తి రమణలు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. రమణ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని టీడీపీ వర్గీయులు అక్కడి నుంచి ఉడాయించారు. వెళ్తూ ‘ఈ సారికి బతికి పోయావ్... నీ అంతుచూస్తామంటూ  హెచ్చరించారు. దాడిలో గాయపడ్డ రమణ స్పృహకోల్పోవడంతో అతడిని ఎల్లయ్యపేటలో తన ఇంటికి తాటిపర్తి రమణ తీసుకెళ్లాడు. కోలుకున్న అనంతరం కుటుంబసభ్యులతో కలిసి కోడా రమణ తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

 

 కేసు నమోదులో తాత్సారం  

 ఆర్థిక మంత్రి సోదరుడు యనమల కృష్ణుడు దగ్గరుండి తనపై హత్యాయత్నం చేయించాడని వైఎస్సార్ సీపీ నేత కోడా రమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తనపై కృష్ణుడు దాడి చేయించాడని, అప్పట్లో ఈ విషయమై జిల్లా ఎస్పీకి, మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశానని పోలీసుల కు వివరించారు. మత్స్యకార వర్గానికి అండ గా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మండల నాయకుడిగా ఉండటంతో తనపై దాడి చేయిం చాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయాలని ఒంటిమామిడి పోలీస్ స్టేషన్లో ఎస్సై రవికుమార్‌కు ఫిర్యాదు చేసినా నమోదుకు తాత్సారం చేశారు.  

 

 స్టేషన్ వద్ద ఉద్రిక్తత...ఎమ్మెల్యే రాకతో కేసు నమోదు

 ఈ దాడి విషయం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలుసుకుని ఆయన పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.  నాయకులు మాకినీడి గాంధీ, పేకేటి సూరిబాబు, యూత్ కన్వీనర్ పేకేటి రాజేష్, పేకేటి హరికృష్ణ, నాగం దొరబాబు,  కోనరాంబాబు, కుర్రాశ్రీను, నాగంగంగ, శివకోటి ప్రకాష్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రమణపై దాడి జరిగిందని మత్స్యకార గ్రామాలకు తెలియడంతో 300 మంది మత్స్యకారులు స్టేషన్‌కు చేరుకున్నారు. రమణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని మత్స్యకారులంతా నినాదాలు చేశారు. స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజా ఎస్సై రవికుమార్‌తో చర్చించారు. సంఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

 

 టీడీపీ వర్గీయులు తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆందోళనతో పరిస్ధితి ఉద్రిక్తతగా మారింది. దీంతో తుని సీఐ చెన్నకేశవరావు, తుని రూరల్ ఎస్సై అశోక్ ఇతర పోలీసు సిబ్బంది ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే రాజా, పార్టీ నాయకులు మాకినీడి గాంధీ మరోసారి పోలీసులతో చర్చించారు. దాడికి ప్రధాన కారణమైన యనమల కృష్ణుడు, అతడి అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు సీఐ అంగీ కరించకపోవడంతో ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెల కొం ది. ఎమ్మెల్యే వారించడంతో వారు శాంతించారు.

 

 ఎస్పీతో మాట్లాడిన జ్యోతుల, రాజా  

 ఎమ్మెల్యే రాజా ఈ విషయమై జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌తో ఫోన్లో మాట్లాడారు. అలాగే పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ కూడా ఎస్పీతో మాట్లాడారని ఎమ్మెల్యే రాజా సీఐకి వివరించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయకుంటే ఇక్కడ నుంచి కదిలేది లేదని ఎమ్మెల్యే భీష్మించారు. చివరకు సీఐ చెన్నకేశవరావు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, దాడికి పాల్పడిన వారిని రెండు గంటల్లో అరెస్టు చేస్తామనడంతో మత్స్యకారులు శాంతించారు. అనంతరం రమణను తుని ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ వివరించారు.

 

 దాడులకు పాల్పడితే ఊరుకోం : ఎమ్మెల్యే

 పార్టీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష్యతో టీడీపీ వర్గీయులు, నాయకులు దాడలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులపై అన్యాయం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈవ్యవహారంపై అసెంబ్లీలో కూడా చర్చించడంతోపాటు పోలీసులు వత్తాసు పలికితే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

 

 దాడుల సంస్కృతి సహించేది లేదు : జ్యోతుల

 అధికార బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ హెచ్చరిం చారు.  బాధితుల పక్షాన ఉండి వారిచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా కేసు నమోదు చేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top